హైదరాబాద్, మార్చి9,
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగద్విఖ్యాత రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం భార్గవ్, జగద్విఖ్యాత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఉదయం విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడితోపాటు సిద్ధార్థ, మల్లిఖార్జున రెడ్డికి సైతం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.జనవరి 5వ తేదీ సాయంత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ.. బోయిన్‌పల్లిలోని ముగ్గురు అన్నదమ్ముల ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వారిని కిడ్నాప్ చేశారు. అనంతరం చిలుకూరు సమీపంలోని ఫామ్ హౌస్‌లోకి తీసుకెళ్లి సంతకాలు పెట్టించి విడిచిపెట్టారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూడగానే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. 18 రోజులపాటు జైలులో ఉన్న ఆమె అనంతరం బెయిల్ మీద బయటకొచ్చారు.