ఐపీఎల్ ఆ జట్టు గెలవాలన్న సెహ్వాగ్
ఐపీఎల్ 11వ ఎడిషన్ ఫీవర్ మొదలయ్యింది. ఆటగాళ్ల వేలం పాటకు రంగం సిద్ధమయ్యింది. ఎనిమిది ఫ్రాంచైజీల యాజమాన్యాలు, మేనజర్లు, వ్యూహకర్తలు ఐపీఎల్ కప్‌ను ఎలా గెలవాలన్న వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇక విషయానికొస్తే...ఐపీఎల్ 11వ ఎడిషన్ విజేత ఎవరో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చేబుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఎల్ కప్ గెలవని ఫ్రాంచైజీ ఏదైనా గెలుస్తుందని, అదే తన ఆకాంక్షగా చెప్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులలో ఒక జట్టు గెలవాలన్నది తన ఆకాంక్షగా చెప్పాడు. తద్వారా ఐపీఎల్‌లో పోటీ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పాడు.
11వ ఎడిషన్ ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు జరగనుంది. తొలి మ్యాచ్‌తో పాటు, చివరి మ్యాచ్‌కు ముంబై వేదికకానుంది. ఇప్పటి వరకు సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రారంభిస్తున్న మ్యాచ్‌ల సమయంలో కూడా మార్పులు చేశారు. ఇకపై సాయంత్రం 4 గంటలకు ప్రారంభించే మ్యాచ్‌ను 5.30 గంటలకు, 8 గంటలకు ప్రారంభించే మ్యాచ్‌ను 7 గంటలకు మార్చారు. 360 మంది భారత ఆటగాళ్లతో సహా మొత్తం 578 మంది ఆటగాళ్ల వేలంపాటను ఈ నెల 27, 28 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించనున్నారు.