ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పెద్దల సంచలన నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సొంత పార్టీ నేతలకే చెక్‌లు పెడుతూ వారికి షాకులు ఇస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల కేటాయింపుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారికి అనూహ్యంగా హ్యాండ్ ఇస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యురప్పకి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ పెద్దలు యడ్డీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన కొడుకుని ఈ ఎన్నికల బరిలోకి దించాలని భావించిన ఆయనకి.. అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది.వరుణ నియోజకవర్గంలో తన కొడుకును బరిలోకి దింపవద్దని తానే నిర్ణయం తీసుకున్నానని, చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేశామని ఆయన తెలిపారు. తండ్రీ-కొడుకుల పోటీకి బీజేపీ అధినాయకత్వం వ్యతిరేకంగా లేదని, చాలాచోట్ల తండ్రీ-కొడుకులిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. వరుణ నియోజకవర్గం నుంచి సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తున్నామని యడ్యూరప్ప తెలిపారు. అయితే ప్రస్తుతం విజయేంద్ర వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది.అనూహ్యంగా విజయేంద్రకు టికెట్ నిరాకరించడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఊహించినట్టుగానే సిద్దరామయ్య కొడుకు యతీంద్రను ఇక్కడి నుంచి బరిలోకి దిగగా.. యడ్యూరప్ప తనయుడికి మాత్రంమొండిచేయి దక్కినట్టు కనిపిస్తోంది. దీంతో సీఎం, ప్రతిపక్ష నాయకుడి తనయుల మధ్య పోరు తప్పింది పార్టీ కార్యాలయంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కుర్చీలు ధ్వంసం చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఇక కొడుకుకేగాక యడ్యూరప్ప సన్నిహితురాలు శోభ కరంద్లాజేకు కూడా పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన వర్గానికి మరోషాక్ తగిలినట్టైంది.కొడుకుతో పాటు యడ్యూరప్ప సన్నిహితురాలికి కూడా టికెట్ నిరాకరిచడం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. వ్యూహాత్మకంగానే ఆయనకు చెక్ చెప్పారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. యడ్యూరప్ప వర్గాన్ని బీజేపీ పెద్దలు టార్గెట్ చేసుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి వరుణ నియోజకవర్గంపైనే పడింది. ఇక్కడి నుంచి సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర పోటీ చేయబోతున్నారు. ఇక ఇక్కడి నుంచి మాజీ సీఎం యడ్యూరప్ప తన తనయుడు విజయేంద్రను బరిలోకి దించాలని భావించారు. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్నాయి.