జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అందుకు తగిన పకడ్భందీ ఏర్పాట్లు చేయడమైనదని, ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు హక్కులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లో రెండు నగరపాలక సంస్థలైన చిత్తూరు, తిరుపతి మరియు 4 మున్సిపాలిటీ లైన మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి లలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇందు కొరకు 344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 137 అత్యంత సమస్యాత్మక మరియు 97 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని, 387 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలకు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 1,131 పెద్దవి, 572 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 73 మంది ఆర్ఓ లను, 106 మంది ఏఆర్ఓ లను, 448 మంది పోలింగ్ అధికారులు (పి ఓ లు ), 30 మంది జోనల్ ఆఫీసర్లను, 65 మంది రూట్ ఆఫీసర్లు, 278 మంది మైక్రో అబ్జర్వర్లును నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 64 బస్సులు, 21 చిన్న వాహనాల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 17 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ స్యానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి సమకూర్చడం జరిగిందన్నారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గం.ల నుండి సా.5 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ తరువాత పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేసి కౌంటింగ్ కేంద్రాలలోని స్ట్రాంగ్ రూమ్ లకు కట్టుదిట్టమైన భద్రతతో తరలించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.. అనంతరం ఈ నెల 14 న కౌంటింగ్ ను నిర్వహించనున్నారు.