తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరున్నర సంవత్సరాల కాలంలో యువత,నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బాబా ఖాదర్ వలి ఆరోపించారు.మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకురాలు చాడ మరియ(సురేఖ) అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబా ఖాదర్ వలి మాట్లాడుతూ వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.లక్ష ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న తెరాస నేతలు ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండోసారి అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ,నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి నిరుద్యోగులను రోడ్డున పడేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని విమర్శలు గుప్పించారు. మేధావులైన పట్టభద్రులు ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించే విధంగా మార్చి 14 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ను గెలిపిస్తే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బైరపాక ప్రభాకర్,పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తిని ఎల్లయ్య గౌడ్, రాష్ట్ర ఎస్టీ విభాగం ప్రధాన కార్యదర్శి రమావత్ నరేష్ నాయక్,టీడీపీ వాణిజ్య విభాగం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ గుప్తా,పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి హరిదాస్ సురేష్,కార్యాలయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్,పల్నాటి రవి,గోకల ప్రవీణ్, చీటూరి ఎలిశా,తదితరులు పాల్గొన్నారు.