టాలీవుడ్ టాప్ హీరోల అత్యసర భేటీ హాట్‌టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అగ్ర హీరోలంతా అన్నపూర్ణ పూర్ణ స్టూడియోలో సమావేశమైనట్లు తెలుస్తోంది. హీరోలు మహేష్‌బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నానిలతో పాటూ మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలతో పాటూ అల్లు అరవింద్, నాగబాబు, పీవీఎస్సెస్ ప్రసాద్, జీవితా రాజశేఖర్, మంచు లక్ష్మితో పాటూ మరికొందరు సినీ ప్రముఖులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.సమావేశంలో ప్రధానంగా ఇటీవలి పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలో తాజా పరిస్థితులపై చర్చించి... ఎలా ముందుకెళితే మంచిదనే అంశంపై అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. భేటీలో హీరోలంతా తమ ఇబ్బందుల్ని చెప్పుకున్నారట. మీడియాతో ఎలా వ్యవహరించాలి... కొన్ని ఛానళ్ల వ్యవహార శైలిపై సుదీర్ఘంగా చర్చించారట. అలాగే రాంగోపాల్ వర్మ ఎపిసోడ్ కూడా ప్రస్తావనకు వచ్చిందట. మీడియా ముందు కాస్త సంయమనం పాటించాలని... తొందరపడి ఎవరూ నోరు జారొద్దని అనుకున్నారట. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీవీచానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని, వాటికి కంటెంట్ ఇవ్వకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, వాటినసలు ప్రోత్సహించకూడదని, టీవీ చానళ్లను బ్యాన్ చేయాలని ఈ భేటీలో ఒక ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. ఇకపై ఇలాంటి సమస్యలేవైనా వస్తే ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదని, గ్రూపులుగా విడిపోకుండా కలిసి మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.శ్రీరెడ్డి వ్యవహారానికి సంబంధించి.. ఆమెను మొదట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య అసలు ఇంతవరకూ వచ్చేది కాదని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మళ్లీ 3-4 రోజుల్లో కలిసి మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ భేటీ ముగించినట్లు సమాచారం. భేటీ వివరాలు ప్రస్తుతానికి మీడియాకు చెప్పకూడదని.. తుది నిర్ణయం తీసుకున్నాక, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారానే ప్రకటించాలని టాలీవుడ్ ప్రముఖులు నిశ్చయించినట్లు తెలిసింది.