గుంటూరు, మార్చి 10,
నిన్న మొన్నటి వరకు టీడీపీ యువనేత నారా లోకేష్‌కు మాట్లాడడం రాదని విమర్శలు చేసే వాళ్ల సంఖ్యే ఎక్కువుగా ఉండేది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైసీపీ వాళ్లు నారా లోకేష్ తడబడిన వీడియోలు షేర్ చేస్తూ ఆటాడుకునే వాళ్లు. నాలుగు నెలలుగా మాత్రం లోకేష్ ప్రవర్తనలో కాని… జనాల్లోకి వెళ్లే తీరు కావొచ్చు… ఇటు మాటల్లోనూ పరిణితి కనిపిస్తోంది. గతంలో ఏ మాట అయినా ఆచితూచి మాట్లాడే లోకేష్ ఇప్పుడు పదును పెంచాడు. పంచ్ డైలాగులు పేలుస్తున్నాడు. నిన్నటి వరకు లోకేష్ మాట సామర్థ్యంపై సందేహాలతో ఉన్న టీడీపీ నాయకులే ఇప్పుడు మంత్రి కొడాలి నాని స్టైల్లో చినబాబు పంచ్ డైలాగులు ఉన్నాయే హర్షం వ్యక్తం చేస్తున్నారు.మంచికో చెడుకో.. ఏదైనా కానీ.. తమ యువ నాయకుడు నారా లోకేష్ కొడాలి నాని మాదిరిగానే కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా పదును దేరాయి. ఆయన సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్న తీరుకు మంచి మార్కులు పడుతున్నాయి. మంత్రి కొడాలిని తీసుకుంటే.. నోరు విప్పితే.. ఆయన ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. నారా లోకేష్‌ను కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఆయన వీడియోలకు, కామెంట్లకు భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటి నాయకుడు టీడీపీలో ఇంత వరకు లేరు.నిన్న మొన్నటి వరకు దేవినేని ఉమా కాస్తో కూస్తో నాని కామెంట్లను కార్నర్ చేస్తూ ఒకటీ ఆరా విమర్శలు చేసినా అవి పేలేవి కావు. ఉమా మాట్లాడడం వరకు ఓకే అయినా.. ఆయన పంచ్ డైలాగులు పేల్చలేరు… అవి పేలవు. ఇక గత నాలుగు రోజులుగా నారా లోకేష్ ఇటు రాష్ట్ర వ్యాప్త ప్రచారంలోనూ. అటు సోషల్ మీడియాలోనూ పదునైన పంచ్‌లతో దుమ్ము రేపుతున్నారు. తాజాగా కూడా సీఎం జగన్‌పై లోకేష్ పరుషంగానే విరుచుకుపడ్డారు. గన్ కన్నా ముందే వస్తాడని చెప్పిన జగన్ ఏమయ్యాడు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి అంటూ.. రెండు రోజుల కిందట విరుచుకుపడిన లోకేష్.. రెండోరోజు.. మరింత పదును పెంచాడు.నారా లోకేష్ జగన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్లు చేశాడు ప్రస్తుతం ఇవి బాగానే ట్రెండవుతున్నాయి. తాము కూడా బరితెగిస్తామని.. మంత్రులను తాము కూడా టార్గెట్ చేస్తామని.. రివేంజ్ తప్పకుండా తీర్చుకుంటామని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే.. వైసీపీ నాయకులు ఎవరూ రోడ్లపై తిరగలేరని లోకేష్ చేసిన కామెంట్లు టీడీపీ వర్గాల్లో మాంచి జోష్ నింపుతున్నాయి. ఈ దూకుడును గమనిస్తున్న నాయకులు మొత్తానికి మంత్రి కొడాలి స్టైల్లో ఘాటు వ్యాఖ్యలకు అలవాటు పడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఈ తరహా దూకుడే ఆయన్ను భవిష్యత్తులో బలమైన మాస్ లీడర్‌ను చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.