కాకినాడ, మార్చి 10,
బంగాళాఖాతంలో తుపానులు వచ్చాయంటే చాలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పల్లెలు వణికిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు తీరంపై విరుచుకుపడుతుంటాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ కోత వల్ల ఇప్పటివరకూ వందల ఎకరాల భూములు సముద్ర గర్భంలో కరిగిపోయాయి. వేలాది ఇళ్లు, ఆస్తులు కడలి కెరటాల్లో కలిసిపోయాయి. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు ప్రారంభించారు. సముద్రపు కోత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల కేంద్ర బృందం కాకినాడ ప్రాంతాన్ని పరిశీలించింది. ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణానికి రూ.320 కోట్ల విడుదలకు సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వెల్లడించారు. అలాగే రూ.3 కోట్లతో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.350 కోట్లతో తీర రక్షణ చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతోంది.ఉప్పాడ తీరానికి సముద్రపు కోత వల్ల ముప్పు ఉందని 1950లోనే అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది. కోత తీవ్రతను 1971లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినా తదుపరి చర్యలపై దృష్టి పెట్టలేదు. గోదావరి నది నుంచి భారీగా ఇసుక కొట్టుకురావడంతో కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు చెప్పారు. అలల తాకిడితో హోప్ ఐలాండ్‌లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు మట్టి కోతకు గురవుతోందని తేల్చారు. కోతకు గురవుతున్న ప్రాంతంలో ఇసుక వేయాలని అప్పట్లో బీచ్ ఎరోజన్ బోర్డు సూచించింది. ఏటా 1.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తెచ్చి తీరంలో నింపాలని సిఫారసు చేసింది. తద్వారా అలల తాకిడికి ఇసుక కోతకు గురవుతూ, తిరిగి అదే ఇసుక మేటలు వేస్తుందని పేర్కొంది. అయితే, ఏటా ఇసుక తరలింపునకు అధికంగా ఖర్చవుతుందని ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. సీ వాల్స్ (రక్షణ గోడ) నిర్మించాలని 1975 ఫిబ్రవరి 12న జరిగిన సమావేశంలో మరో ప్రతిపాదన చేశారు. ఈ మేరకు 1982లో రూ.31.86 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని రాష్ట్ర వరద నివారణ బోర్డుకు చెందిన సాంకేతిక సంఘం పరిశీలించి 1982 జూలై 22న ఆమోదించింది.ఉప్పాడలో సూరాడపేట, సుబ్బంపేట తదితర ప్రాంతాల్లో జియోట్యూబ్ రక్షణ గోడ సైతం కోతకు గురై, శిథిలం కావడాన్ని పరిశీలించారు.