బెంగళూర్, మార్చి 10,
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అనుకున్నట్లుగానే జరుగుతుంది. కర్ణాటక రాజకీయాల్లో ఆయనే కింగ్ మేకర్ అని మరోసారి రుజువయింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఆధిపత్యం కుమారస్వామికి వరంగా మారనుంది. అందుకే రెండు పార్టీల సాయంతో ఆయన రెండు సార్లు కర్ణాటకకు ముఖ్యమంత్రి అయ్యారు. తక్కువ స్థానాలను సాధించినా కాంగ్రెస్, బీజేపీలు ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నాయి.కర్ణాటక రాజకీయాల్లో జనతాదళ్ ఎస్ ది పరిమితమనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఉప ప్రాంతీయ పార్టీ. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్, ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. కేవలం ఒక సామాజికవర్గం ఓట్లపైనే కుమారస్వామి పార్టీ అక్కడక్కడ మెరుపులు మెరిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఎదురయినప్పుడు అది కుమారస్వామికి కలసి వస్తుంది.అందుకే కుమారస్వామి ఎప్పుడూ నేరుగా ఏ పార్టీతోనూ పొత్తును కోరుకోరు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని కుమారస్వామి చేతులు కాల్చుకున్నారు. తండ్రి దేవెగౌడ, కుమారుడు నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యారు. దీని తర్వాత ఏ పార్టీతో ఎన్ికల ముందు పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం పొత్తులు వాటంతట అవే వస్తాయి. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుమారస్వామి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు.
కుమారస్వామికి అదృష్టం ఎలా ఉందంటే.. మైసూరు కార్పొరేషన్ ను జేడీఎస్ చేజిక్కించుకుంది. ఒప్పందం ప్రకారం దీనిని కాంగ్రెస్ కు ఇవ్వాల్సి ఉన్నా కుమారస్వామి తన అభ్యర్థిని బరిలోకి దింపారు. బీజేపీ మైసూరు కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాలని తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా జేడీఎస్ అభ్యర్థికి మద్దతిచ్చింది. దీంతో మైసూరు కార్పొరేషన్ పై జేడీఎస్ జెండా ఎగింది. అంటే ఏ ఎన్నికలైనా కుమారస్వామికి బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒకటి మద్దతివ్వక తప్పదన్న మాట.