సికింద్రాబాద్, మార్చి 10,
టూవీలర్, కార్ పార్కింగ్ చార్జీల పేరుతో ప్రయాణీకుల జేబులు గుల్ల చేస్తున్న దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) తాజాగా ఆటో, టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుంది. పార్కింగ్ ఫీజు పేరుతో వారి జేబుల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు రైల్వేస్టేషన్లలోకి ఆటోలు, టాక్సీలు ఉచితంగా వెళ్తూ, ప్రయాణీకుల్ని స్థానికంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న విషయం తెలిసిందే. దీనిని రైల్వే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేస్తుంటారు. సహజంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు ప్రయాణీకులు వెళ్లాల్సిన గమ్యాలకు ఇష్టం ఉంటే వెళ్తారు లేదంటే కుదరదని చెప్పేస్తారు. కానీ రైల్వేస్టేషన్‌లోని ఆటో, టాక్సీ స్టాండ్లల్లోకి వెళ్లాక ప్రయాణీకులు వెళ్లాల్సిన గమ్యస్థానాలకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. లేకుంటే ట్రాఫిక్ పోలీసులు అక్కడికక్కడే చలానాలు రాసేస్తారు. ఇప్పుడు దీనికి తోడు రైల్వే అధికారులు ఆటో, టాక్సీల నుంచి కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఓ సర్క్యులర్‌ను విడుదల చేశారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా డివిజన్ పరిధిలోని రైల్వేస్టేషన్ల ఆవరణలోకి రావాలంటే తమ వాహనాలతోపాటు వ్యక్తిగత వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దానికోసం ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో రైల్వేస్టేషన్లలో నమోదు చేయించుకోవాలి. వీటిని ఒరిజినల్స్‌లో పోల్చి, పరిశీలించి, అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమర్షియల్ స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. డ్రైవర్లు వ్యక్తిగతంగానే వీటన్నింటినీ అందచేయాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆమోదించాక ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధికారులు నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.ఫీజుల వసూలుకు రైల్వేస్టేషన్లను ఆరు కేటగిరీలుగా విభజించారు. నాన్ సబర్బన్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ) పేరుతో 1 నుంచి ఆరు వరకు కేటగిరీలు, సబర్బన్ (ఎస్‌జీ) మూడు కేటగిరిలతో పాటు హాల్ట్ (హెచ్‌జీ) పేరుతో స్టేషన్లను గుర్తించారు. ఆయా కేటగిరిలకు చెందిన ఆటో, టాక్సీ డ్రైవర్లు రైల్వేó అధికారులు నిర్ణయించిన పార్కింగ్ ఫీజును చెల్లిస్తే, దరఖాస్తుదారుడికి సీరియల్ నెంబర్ ఇస్తారు. నాన్ సబర్బన్ కేటగిరి-2, 3, సబర్బన్-3 కేటగిరి రైల్వేస్టేషన్లలో ఆటోలకు సంవత్సరానికి రూ.7వేలు, టాక్సీలకు రూ.10,800 ఫీజుగా నిర్ణయించారు (వీటిలో సగం అర్థసంవత్సర ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించారు) నాన్‌సబర్బన్ గ్రూప్-4వ కేటగిరిలో అయితే ఆటోలకు రూ.5వేలు, టాక్సీలకు రూ.7వేలు ఫీజు చెల్లించాలి. ఇతర స్టేషన్లలో అయితే ఆటోలకు రూ.3వేలు, టాక్సీలకు రూ.5వేలు పార్కింగ్ ఫీజుగా నిర్ణయించారు. వీటికి ప్రత్యేకంగా సీరియల్ నెంబర్లు ఇచ్చి, ఆ వాహనాలను మాత్రమే రైల్వేస్టేషన్ల ఆవరణలోకి అనుమతి ఇస్తారు. ఈ ఉత్తర్వులను 2019 డిసెంబర్ 23వ తేదీతో ఇచ్చినప్పటికీ, 2020 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా అమల్లోకి తేవాలనీ, ఈ లోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటూ అన్ని రైల్వేస్టేషన్లకూ తాజాగా పంపించారు.రైల్వేశాఖ ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. ఈ ఉత్తర్వులను కార్పొరేట్ వెబ్ బేస్‌డ్ ఆన్‌లైన్ క్యాబ్‌ల కోసమే ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. సాధారణ ఆటో, టాక్సీ డ్రైవర్లు అంతంత మొత్తాల్లో పార్కింగ్ ఫీజులు కట్టలేరు. తమ ఆటోలు, టాక్సీలో ప్రయాణించేవారిని రైల్వేస్టేషన్ల సమీపంలోని రోడ్ల వద్దే దించేస్తారు. దీనితో వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకసారి ఈ ఇబ్బందులు పడ్డాక ప్రయాణీకులు సహజంగానే ఆన్‌లైన్ వెబ్‌బేస్‌డ్ క్యాబ్‌లు, ఆటోలను బుక్ చేసుకొని ప్రయాణిస్తారు. ఈ వాహనాలకు కార్పొరేట్ సంస్థలు పన్నులు చెల్లిస్తాయో లేదో తెలియదు కానీ, క్యాబ్‌లు మాత్రమే రైల్వేస్టేషన్ల లోపలి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.దక్షిణమధ్య రైల్వే వాణిజ్య విభాగం అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది.