మారుతున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగాల తీరూ మారుతోంది. నైపుణ్యాలకు తగిన ఉద్యోగం వెతుక్కోవడం కూడా సవాలే. ఈ విషయంలో ఇప్పటికీ చాలా మంది వెనుకబడే ఉన్నారని అనేక సర్వేల్లో తేలింది. మరి ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశం చేజిక్కించుకోవడం ఎలా? ఎలాంటి అన్వేషణ పద్ధతుల ద్వారా సరైన ఉద్యోగాలను ఒడిసిపట్టుకోవచ్చు? దీనికి గూగుల్ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసింది. సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు ఉండటం లేదు. వీటిని సక్రమంగా వాడుకుంటే అరచేతిలోనే సరైన అవకాశాలను చూసుకోవచ్చు. గూగుల్ సపోర్ట్ ద్వారా పనిచేసే ‘స్కిమా.ఆర్గ్ సాయంతో ఇటు ఉద్యోగార్థులు, అటు ఉద్యోగాలిచ్చే సంస్థలూ ప్రయోజనం పొందొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.జాబ్ సీకర్స్ కోసం కొత్త సెర్చ్ విధానాలను అందించింది. దీని ద్వారా నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను సులభంగా, వేగంగా అందిపుచ్చుకోవచ్చని చెబుతోంది.సెర్చ్ పద్ధతుల్లో చిన్న చిన్న ట్రిక్స్ పాటించడం వల్ల ఉద్యోగాన్వేషణ చాలా తేలికవుతుంది. జాబ్ అలర్ట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సేవ్ లిస్టింగ్స్, స్మార్ట్ ఫిల్టర్స్‌ను ప్రభావవంతంగా వాడుకోవడం ఉద్యోగార్థుల పనిని తేలిక చేస్తుంది. ఇందు కోసం అనేక యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగార్థులతోనే కాకుండా.. ఉద్యోగాలు కల్పించే సంస్థలనూ గూగుల్ సంప్రదించింది. జాబ్ నోటిఫికేషన్లు చిన్నవైనా, పెద్దవైనా.. నూతన సెర్చ్ పద్ధతుల ద్వారా సంబంధిత వ్యక్తులకు నేరుగా చేరుకునేలా ఆయా సంస్థలకు సైతం కొన్ని సూచనలు చేసింది. ఇందు కోసం టైమ్స్‌జాబ్స్, క్వికర్ జాబ్స్, షైన్.కామ్, టీ జాబ్స్, విజ్డమ్ జాబ్స్ తదితర సంస్థలతో కలిసి పనిచేయడానికి గూగుల్ ముందుకొచ్చింది.