ఒక్క వ్రేలు చూపి ఒరులను నిందింప వెక్కిరించు నిన్ను మూడు వ్రేళ్లు( వేయి వ్రేళ్లు)
మనం ఎంత గొప్ప వాళ్లమైనా కావొచ్చు గాని ఇతరుల్ని కించపరిస్తే అది మనకు ముప్పు తెచ్చి పెడుతుంది. ఒక్కొక్కప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఆత్మశ్లాఘ ఎంత ప్రమాదమో పరనింద అంతకంటే ఎక్కువ ప్రమాదం. అందువల్ల మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో అంత అణకువగా కూడ ఉండడం నేర్చు కోవాలి. లేకపోతే సమాజమే మనకి గొప్ప గుణ పాఠం చెబుతుంది. ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి. ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది. "భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతికి ఈ ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఎంచెప్పాలి? కొంచెం ఆలోచించింది. "సుతను బలిమఖే " అంది. 'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం. ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది. తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం. మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది. మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది. క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది. మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.
' నైవ జానే వరాహం ' అంది “ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది. బాలే! కచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. 'మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది.
"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది. మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది. నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.
భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?
మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం
బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా
లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న:
-(శ్రీ అప్పయ్య దీక్షితులు)
ఓం నమో నారాయణాయ
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో