కోల్‌కతా మార్చ్,10
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నిలక కోసం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్‌లో రెండు కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించిన తర్వాత ఆమె హల్దియా సబ్-డివిజినల్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆమె వెంట పార్టీ అధ్యక్షుడు సుబ్రతా భక్షి ఉన్నారు. నామినేషన్ వేసే ముందు మమతా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం. తనలాగా బీజేపీ వాళ్లు శ్లోకాలు చదవగలరా అంటూ మంగళవారం ఆమె సవాలు విసిరిన విషయం తెలిసిందే. తాను రోజూ చంఢీపాఠ్ చదువుతాననీ ఆమె చెప్పారు. అయితే దీనికి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గట్టి కౌంటరే ఇచ్చారు. మమతా భయపడుతున్నారు. ఆ భయంతోనే ఆమె తప్పుడు మంత్రాలు చదువుతున్నారు. ప్రధాని మోదీని ఆమె బయటి వ్యక్తి అన్నారు. కానీ నందిగ్రామ్ మాత్రం ఆమెనే బయటి వ్యక్తి అంటున్నది. ఐదేళ్ల తర్వాత ఆమె నందిగ్రామ్‌కు వచ్చారు. ఆమె అవకాశవాది. అంఫాన్ తుఫాన్ తర్వాత కూడా ఆమె నందిగ్రామ్‌కు రాలేదు. తన మేనల్లుడి నియోజకవర్గమైన డైమండ్ హార్బర్‌కు వెళ్లారు అని సువేందు విమర్శించారు. మమతపై బీజేపీ తరఫున పోటీ చేయనున్న సువేందు.. ఈ నెల 12న నామినేషన్ దాఖలు చేయనున్నారు.