విజయవాడ మార్చ్,10
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. వైసీసీ దాష్టీకాలకు ఎస్ఈసీ అడ్డుకట్ట వేయాలి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఓటర్లను వైసీపీ భయపెడుతోంది. ఓడిపోతారన్న భయంతో టీడీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. ఓటింగులో పాల్గొనకుండా చేస్తున్నారు. విజయవాడ 8వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి రజనీ భర్త కొత్తపల్లి రాజశేఖర్ టీడీపీ నేత గోగినేని శ్రీధర్ పై దౌర్జన్యానికి దిగారని అయన ఆరోపించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి నియమించిన 9 మంది ఆర్.ఓలలో ఐదుగురు ఆర్.ఓలు వైసీపీ 4వ వార్డు అభ్యర్థి రామలింగారెడ్డికి చెందిన కాలేజీలో అధ్యాపకులుగా పనిచేస్తుండగా అదే కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో విధులు కేటాయించారు. తిరుపతి 18వ డివిజన్లో దొంగ ఓట్లు వేసేందుకు చెవిరెడ్డి సోదరుడు స్థానికేతరులను తీసుకొచ్చి స్థానిక ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడడం అత్యంత హేయం. వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లోకి ఏం పని? ఓటర్లను బెదిరించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎస్ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అదే పద్దతి అనుసరిస్తే.. ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత భయంతో ఎన్నికలను హైజాక్ చేసి గెలవాలని చూస్తున్నారు. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఓటర్లను, అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అధికార పార్టీ దాష్టీకాలను, దుర్మార్గాలను ఎన్నికల సంఘం నిలువరించాలి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అయన అన్నారు.