కోయంబత్తూరు మార్చ్ 10,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు పీసీ చాకో వెల్లడించారు. గతంలో కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఆయన ఇవాళ ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చాకో రాజీనామా కీలకంగా మారింది. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇదో ఎదురుదెబ్బ. తనను పార్టీ విస్మరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో అభ్యర్థుల జాబితా గురించి చర్చించలేదని, అందుకే తన రాజీనామా లేఖను సోనియాకు పంపినట్లు పీసీ చాకో తెలిపారు. గత ఏడాది నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు లేరని, ఇలాంటి సందర్భంలో కేరళలో కాంగ్రెస్ నేతగా కొనసాగడం కష్టమని, ఏదో గ్రూపుకు చెందితేనే ఇక్కడ మనుగడ సాగించగలమని, నాయకత్వం యాక్టివ్‌గా లేదని చాకో ఆరోపించారు.
కేరళలో కీలకమైన ఎన్నికలు జరగనున్నాయని, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని, కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు ఆయన ఆరోపించారు. ఇదే అంశాన్ని అధిష్టానంతో చర్చించినట్లు ఆయన చెప్పారు. కానీ ఆ రెండు గ్రూపులు ఇస్తున్న ప్రతిపాదనలను హైకమాండ్ అంగీకరిస్తోందని, దీని వల్ల కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని ఆయన అన్నారు. కోఆర్డినేషన్ కమిటీలు రెండుగా పనిచేస్తున్నాయని, దీన్ని వెంటనే ఆపేయాలన్నారు.