అప్పట్లోఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో.., బ్రోచెవారెవరురా.. వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా రాజేంద్రప్రసాద్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రంలో లవ్ లీ సింగ్ హీరోయిన్ నటిస్తోంది. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ..
ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్టయ్యింది?
- అనిల్ రావిపూడిగారు ఫోన్ చేసి ఒక సారి నిన్నుకలవాలి అని అన్నారు. అలాగే సాహూ గారు, హరీష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. వాళ్లు ఫోన్ చేసి ఇలా కథ చెప్తారంట అనగానే ఆయనేంటి నాకు కథ చెప్పడం ఏంటి..ఆయనవన్నీ కమర్షియల్ సినిమాలు..నేను కొత్త కొత్త డైరెక్టర్స్‌తో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను. దాంతో పాటు ఇంతకు ముందు నా రెండు మూడు సినిమాలకి అనిల్ రావిపూడిగారు వచ్చి సపోర్ట్ చేశారు. మా ఈవెంట్‌కి వచ్చి మాకు ఎనర్జి ఇచ్చి వెళ్లేవారు. ఆయనంటే నాకు గౌరవం. సరే రమ్మన్నారు కదా అని వెళ్లాను. ఈ సినిమా పాయంట్ చెప్పారు. ఎలా ఉంది నీకు నచ్చితే చేద్దాం అన్నారు. చాలా బాగుంది.. నేను రెడీ అని చెప్పాను. తర్వాత డైరెక్టర్, టెక్నీషియన్స్ ని సెట్ చేసి చెప్తాను అని చెప్పారు. ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అడగగానే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పారు. అప్పుడే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా వచ్చింది.
ఈ సినిమా మీ కథా, మీ ఫాదర్ కథా?
- ఎవరో ఒకరిది అని కాదు. ఈ స్టోరీలోనే నేను, ఫాదర్ ఇద్దరం కుదిరాము.
సెట్లో రాజేంద్ర ప్రసాద్, మీ మధ్య డిస్కర్షన్స్ ఎలా ఉండేవి?
- నేను ఒక సారి రెడీ అయ్యి షూటింగ్ ఎట్‌మాస్పీయర్ లోకి ఎంటర్ అయ్యాక నా పని నేను చేసుకుంటాను. షూటింగ్ ఎక్కువ భాగం ఔట్‌డోర్ లో జరగడం వల్ల బ్రేక్‌లో రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరినుండి సలహాలు, సూచనలు తీసుకునేవాడిని. ఆయనా చాలా బాగా చెప్పేవారు. 90వ దశకంలో ఒకే సంవత్సరం 12 సినిమాలు చేశారు. అందులో 8సినిమాలు వందరోజులు ఆడాయని చెప్పారు. అన్ని పాత్రలు ఎలా సెలక్ట్ చేసుకునేవారు, ఎలా చేసేవారు? ఇలాంటి ప్రశ్నలు ఆయన్ని అడిగినప్పుడు చాలా గొప్పగా సమాధానాలు చెప్పేవారు. ఆయనని కలిసిన తర్వాత డిఫరెంట్ కథలు ఎలా సెలక్ట్ చేసుకోవాలి అనేదానికి చాలా హెల్ప్ అయ్యింది. ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి ఇన్‌పుట్స్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా ఈజీగా చేయగలిగాను. దాదాపు ప్రతి షాట్ సింగిల్ టేక్‌లోనే చేశాను.
సంగీత దర్శకుడిగా అచ్చు రాజమణిని ఎంచుకోవడానికి రీజనేంటి?
- అచ్చు తమిళ్‌లో ఒక పాట చేశాడు. అది నాకు పర్సనల్‌గా బాగా నచ్చింది. ఈ టీమ్ కూడా విని బాగుంది అన్నారు. ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెడదాం లేదా ఆ పాట యాజ్ఇట్ఈజ్ గా పెడదాం అని వారికి చెప్పాను. వారు సరే మ్యూజిక్ అచ్చుతోనే చేపిద్దాం అన్నారు. అలా అచ్చుని సంగీత దర్శకుడిగా తీసుకున్నాం. ఆ పాటతో పాటు ఈ సినిమాలో ఫాదర్ ఎమోషన్స్‌తో ఫీ ఫీ ఫీ సాంగ్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది.
తండ్రి కొడుకుల కథలో ఒక అమ్మాయికి ఎంత స్కోప్ ఉంటుంది?
- ఈ సినిమాలో కోర్ ఎమోషన్ మాత్రమే ఫాదర్ అండ్ సన్ మీద ఉంటుంది. మిగతా పార్ట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. లవ్‌లీ సింగ్ కొత్త అమ్మాయి. చాలా బాగా చేసింది. తన క్యారెక్టరైజేషన్ తప్పకుండా ఆడియన్స్‌కి నచ్చుతుంది.
రీయల్ లైఫ్ లో మీ పేరెంట్స్‌తో ఎలా ఉంటారు?
- ఇప్పటి వరకూ నేను ఏ పని చేసిన ఎప్పుడూ క్వచన్ చేయలేదు. నేను ప్రతీది వారికి చెప్పే చేస్తాను. చిన్నప్పటినుంచి నువ్వు అది చేయి ఇది చేయి అని ఎప్పుడూ ప్రజర్ పెట్టలేదు. నా మీద ఒక నమ్మకం ఉంది. అందుకే మన ఇంట్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చాను. దానికి మా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎక్కువ కనెక్ట్ అయి ఉండడం కూడా ఓ కారణమేమో.
కొత్త వారితో ఎక్కువ చేయడం వల్ల ఎక్కువగా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. టీమ్ అందరం అరకు వెళ్లి 30డేస్ అక్కడే షూట్ చేశారు. ఇంటీరియర్ వర్క్ హైదరాబాద్ లో తెరకెక్కించాం. ఈ సినిమా అంతా ముందే ప్రాపర్‌గా ప్లాన్ చేయడం వల్ల షూటింగ్ సరదాగా జరిగింది. మా మధ్య డిస్కర్షన్స్ చాలా హెల్తీగా ఉండేవి. మంచి రన్‌టైమ్...ఆడియన్స్‌కి కూడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఫ్యామిలీస్ కి చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.
మంచి కథలను మీరు సెలక్ట్ చేసుకుంటున్నారా లేదా మీ కోసమో మంచి కథలు రాస్తున్నారా?
- ఇది వరకు నేను కథల కోసం పరిగెత్తే వాడిని ఇప్పుడు మంచి మంచి కథలు నా దగ్గరకి వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది.
ఈ కథ అనిల్ కాకుండా వేరే డైరెక్టర్ వచ్చి చెప్పుంటే సినిమా చేసేవారా?
- బేసిక్‌గా ఈ కథ నేను అనిల్ రావిపూడి గారి జోనర్‌కి వెళ్లడం కాదండీ.. ఆయనే నా జోనర్‌కి వచ్చి తయారు చేసిన కథ. నాకు సెట్ అయ్యే కథే.. కాబట్టి డెఫినెట్‌గా చేసేవాడిని. అలాగే ఈ సినిమా చాలా మంది వేరే భాషల్లో రీమేక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక వేళ నాకు అవకాశం ఉంటే మరో 20 సంవత్సరాల తర్వాత రాజేంద్ర ప్రసాద్‌గారి పాత్ర నేనే పోషించి ఈ సినిమా రీమేక్ చేస్తాను.
తదుపరి చిత్రాల గురించి?
- ప్రస్తుతం రాజరాజచోర సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. తర్వాత అర్జునఫల్గున సినిమా 60% షూట్ కంప్లీట్ అయింది. తర్వాత ఒక కొత్త దర్శకుడితో కాప్ బయేపిక్ (పోలీస్ ఆఫీసర్ బయోపిక్) చేస్తున్నాను. అలాగే నా ఫస్ట్ మూవీ బాణం డైరెక్టర్‌తో మరో మూవీ చేస్తున్నాను. ఈ ఏడాది కచ్చితంగా మూడు సినిమాలు విడుదలవుతాయి.