విజయవాడ, మార్చి 10,
టీడీపీ అధినేత చంద్రబాబుకుఏపీ హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఎస్‌ఈసీతో పాటు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని కోరగా.. హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది.టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నిలకు మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధమని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. దీన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 2లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.. టీడీపీ ఎస్ఈసీకి వివరణ ఇచ్చింది. ఆ వివరణపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.. వెంటనే మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డతో టీడీపీ నేతలు సమావేశమై మేనిఫెస్టోను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.