YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబు రివర్స్ ఎటాక్...

బాబు రివర్స్ ఎటాక్...

బాబు రివర్స్ ఎటాక్...
విజయవాడ, మార్చి 11, 
ఆ రెండు కార్పొరేషన్ల ఎన్నికల్లో చంద్రబాబు భిన్నమైన లైన్‌ ఎంచుకున్నారు. ఓటర్లను ఉద్దేశించి కటువుగానే ప్రసంగించారు. ఏకంగా.. సిగ్గు, పౌరుషం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత స్వరం ఎందుకు కఠినంగా మారింది? ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? పరిస్థితి చేయిదాటుతోందని ఆందోళన చెందారా?  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో  పలుచోట్ల ప్రచారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తీవ్రస్థాయిలోనే రాజకీయ విమర్శలు చేశారు. రాష్ట్రంలో మిగిలి ప్రాంతాల్లో జరిగిన  ప్రచారం ఒక ఎత్తు అయితే.. విజయవాడ, గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్లలో నిర్వహించిన ప్రచారం మరో ఎత్తు అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో చంద్రబాబు భిన్నంగా ప్రసంగించారు. ప్రజలను ఓట్లు అభ్యర్థించకపోగా.. వారికి చురకలు అంటించారు. మీకు సిగ్గు, పౌరుషం లేదా అని గయ్యిమన్నారు. ఇలాగే ఉంటే మీ ఇష్టం అని శాపనార్థాలు పెట్టారు కూడా. మీరంతా స్వార్థపరులు అని ఓపెన్‌ కామెంట్‌ చేశారు. ఈ ప్రసంగాలు.. చంద్రబాబు ఉపయోగించిన పదాలే ఇప్పుడు చర్చగా మారాయి. సాధారణంగా ప్రజలను.. ఓటర్లను ఉద్దేశించి రాజకీయ నేతలు ఆచితూచి మాట్లాడతారు. వీలైతే నాలుగు మాటలు ఎక్కువ చెప్పి పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఏదైనా అనాలంటే భయపడతారు. ఎన్నికల సమయంలో మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని నమ్మించే ప్రయత్నాలు కూడా ఉంటాయి. చంద్రబాబు మాత్రం ఈ రెండు కార్పొరేషన్లలో రాజధాని పోతుంటే మీరు కదలరా అని ప్రశ్నించారు. ఇతర జిల్లాల్లో కంటే ఇక్కడ పూర్తిగా భిన్నమైన లైన్ తీసుకుని ఓటర్లను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది. నేను రాజధానిని ఇస్తే.. మీరు రాజధాని కోసం ఏం చేశారు అని ప్రశ్నించారు చంద్రబాబు. టీడీపీ అధినేత నుంచి ఇలాంటి కామెంట్స్‌ ఎవరూ ఊహించి ఉండరు. ఎప్పుడో జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వారే ఇలాంటి కామెంట్స్‌ చేసి చర్చల్లో నలుగుతారు. ఈ రెండు కార్పొరేషన్ల ప్రచారంలో ఎటాక్ పాలిటిక్స్ లైన్ తీసుకోవడం పూర్తిగా వ్యూహాత్మకమే అని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. రాజధాని పేరుతో ఇక్కడ ఎంతో మేలు జరిగిందని.. ఫ్లైఓవర్లు ప్రాజెక్టులు తెచ్చామని.. అయినా ప్రజలు ఆదరించలేదన్న ఆవేదన టీడీపీకి ఉంది. అందుకే ఎన్నికల్లో ప్రచారంలో బాబు ఓటర్లను కడిగేశారని కొందరి వాదన. ఇంతకంటే మీకు ఎవరేం చేస్తారు అని  ప్రశ్నించడం ద్వారా..  అమ్మా బాబు ఓట్లు వెయ్యండి అనే అభ్యర్థనలను పక్కన పెట్టి 'మీ ఇష్టం లేకపోతే మీకే కష్టం అని తేల్చేశారు చంద్రబాబు. ఎవరో ఒకరిద్దరు తప్ప అధినేత తీసుకున్న లైన్ బాగుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. టీడీపీకి ఇంకా కొత్తగా పోయేది ఏమీ లేదని.. ఈ రెండు నగరాల విషయంలో చంద్రబాబు ఆ మాత్రం  కటువుగా ప్రసంగించడం మంచిదే అని అనుకుంటున్నారట. ప్రజల్లో చర్చ అయితే జరుగుతుంది కదా.. ఒకవేళ  చర్చ జరగకపోయినా పోయేది ఏమీ లేదని చెబుతున్నారట. మరి.. గుంటూరు, బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ అధినేత ఎంచుకున్న అటాక్‌ పాలిటిక్స్‌  ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి

Related Posts