బాంబు పేల్చిన పెద్దిరెడ్డి
తిరుపతి, మార్చి 11,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. వైఎస్సార్, చంద్రబాబులకు సమకాలీనుడైన రాజకీయ నాయకుడు. జగన్ ఆయనకు బాగా జూనియర్, కుమారుడి వరసకు వస్తారు. అయినా రాజకీయాల్లో సీనియారిటీలు పనిచేయవు. లక్ ఉంటేనే నక్కను తొక్కుతారు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు ఇంతే ప్రాప్తం అని ఇప్పటిదాకా రాజకీయంగా సరిపెట్టుకుంటూ వచ్చారు. ఆయన వైఎస్సార్ తో కలసి పనిచేశారు. జగన్ తోనూ పనిచేస్తున్నారు. కానీ ఆయనకు తన సీనియారిటీ ఇపుడు బాగా ఎక్కువగా గుర్తుకువస్తున్నట్లుగా ఉంది.జగన్ ఏదైనా కారణాల వల్ల జైలుకు పోతే ఆయన ప్లేస్ లో ముఖ్యామంత్రి అయ్యేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని ఆ మధ్యన మీడియా ఒక్క లెక్కన కోడై కూసింది. దానికి తోడు అన్నట్లుగా జగన్ కూడా పెద్దిరెడ్డికి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పెద్ద పీట వేస్తూ వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరులో మరో నేత వేలూ కాలూ పెట్టే చాన్సే లేదు. ఆ మాటకు వస్తే జగన్ కూడా పెద్దిరెడ్డిని కాదని అక్కడ ఏమీ చేయలేరు అని చెబుతారు. అంతలా హవా చాటుకుంటూ వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా అన్న మాట వైసీపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయింది.నేనే సీఎం అయితే అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్ద బాంబునే పేల్చారు. నేను జగన్ మాదిరిగా మౌనంగా ఉండను, మడి కట్టుకుని కూర్చోను. నేనే సీం అయి ఉంటే టీడీపీ మొత్తాన్ని అవతలకు లాగి పారేస్తాను. ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరినీ మిగలనీయను. ఒక్క చంద్రబాబే టీడీపీలో ఉంటాడు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు చర్చకు తావిస్తున్నాయి. పెద్దిరెడ్డి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదు కానీ నేనే సీఎం అయి ఉంటే అన్న మాటే పొలిటికల్ గా బిగ్ సౌండ్ చేస్తోంది.నాలిక మీద మాటలు వచ్చాయంటే మనసులో అభిప్రాయం ఉండే ఉంటుందని కూడా అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూసి జగన్ జాగ్రత్త పడాలని గతంలోనే ఆ పార్టీలో చాలా మంది గుసగుసలాడేవారు. ఆ మధ్యన జగన్ సైతం పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డిలకు ప్రాధాన్యత తగ్గించారని వినిపించింది. కానీ రాజకీయ అవసరాల కోసం ఆయన మళ్ళీ దగ్గరకు తీశారని చెబుతారు. ఇవన్నీ ప్రచారంలో ఉన్నవే. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుని విమర్శించే దూకుడులో అలా అన్నారని అంటున్నారు. జగన్ మంచివాడు కాబట్టే బాబు ఇప్పటికీ తన ఎమ్మెల్యేలతో అలా మిగిలిపోయాడు, నేను కనుక సీఎం అయితే బాబుకు ఎమ్మెల్యేలే లేకుండా చేసేవాడిని అన్న ఉద్దేశ్యంతో అన్నారని అంటున్నారు. అది అలా అన్నా కూడా జగన్ మంచితనం కంటే రాజకీయ చేతగానితనం గురించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినట్లుగా ఉందని అంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో మంచితనాలకు తావు లేదు కాబట్టి. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేనే సీఎం అయి ఉంటే అన్న మాట మాత్రం ఇపుడు బాగా వైరల్ అవుతోంది మరి.