గంట వాయిస్ పెరుగుతోందే
విశాఖపట్టణం, మార్చి 11,
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఏంటో తెలియదు కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దూకుడుతో మాత్రం ప్రధాన పక్షాలకు చమటలు పడుతున్నాయి. ఉక్కు ప్రైవేట్ పరం అన్న వార్త ఇలా రాగానే అలా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసేసి కూర్చున్నారు. ఆయన తన రాజీనామా కాగితాన్ని జేబుల్లో ఎప్పటి నుంచో ఉంచుకున్నారని, ఇపుడు ఇలా సరైన అవకాశం దొరికింది కాబట్టి చేశారు అని ప్రత్యర్ధులు అంటున్నారు. పోనీ ఆయన వరకూ సరే కానీ ఇపుడు అందరినీ పనిగట్టుకుని రాజీనామా చేయమని మాజీ మంత్రి అల్టిమేటం జారీ చేయడమే అసలు ఏం బాగులేదని అంటున్నారు.ఓ వైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ బాటలోకి వెళ్ళే సూచనలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ చేసిన వెబ్ నార్ ప్రసంగమే అందుకు ఉదాహరణ. ఈ ప్రసంగాన్నే ఇపుడు గంటా శ్రీనివాసరావు కూడా నొక్కి వక్కాణిస్తూ పదవులు పట్టుకుని వేళ్లాడితే ఉక్కు ఇక తుక్కుకు కూడా మిగలదు అంటూ హెచ్చరిస్తున్నారు. తాను రాజీనామా చేశాను, తనతో పాటుగా అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. పదవీ వ్యామోహంతో నేతలు ఉంటే మాత్రం ఉక్కు నగరం విశాఖ ప్రతిష్ట మంటగలిసిపోవడం ఖాయమని కూడా గంటా శ్రీనివాసరావు బిగ్ సౌండ్ చేస్తున్నారు.విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు అంతా రాజీనామా బాట పట్టాలని గంటా శ్రీనివాసరావు ఇస్తున్న పిలుపుతో అటు అధికార పక్షం వైసీపీకి, ఇటు ప్రతిపక్షం టీడీపీకి కూడా ముచ్చెమటలు పోస్తున్నాయట. ఈ మూడు జిల్లాల్లో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మాత్రమే టీడీపీకి ఉన్నారు. అందులో విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. మరో వైపు గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ లెక్కన చూస్తే నలుగురే టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీ ఉంటారన్న మాట. మరి మిగిలిన వారంతా వైసీపీకి చెందిన వారే. దాంతో వైసీపీకి ఇది ప్రాణ సంకటంగా మారుతోంది అంటున్నారు.గంటా శ్రీనివాసరావు ఇలా డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన వెనక టీడీపీ హై కమాండ్ ఉండి ఆట ఆడిస్తోందా అన్న అనుమానాలను కూడా వైసీపీ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామా డిమాండ్లను వైసీపీ కొట్టిపారేస్తోంది. రాజీనామాలతో ఏమీ జరగదు అంటోంది. చట్ట సభల్లో ఉండి గొంతు వినిపించడం ద్వారానే ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోగలమని కూడా చెబుతోంది. అదే సమయంలో తాము ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కానీయమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరి గంటా శ్రీనివాసరావు రోజు రోజుకూ గొంతు పెంచుతున్నారు. ఇవాళ కాకపోయినా రేపు అయినా ఈ ఉక్కు సెగ వైసీపీకి గట్టిగా తగిలితే పదవులు గోవిందాయేనా అన్న మాట పార్టీలో వినిపిస్తోంది.