YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ లో పట్టుకోల్పొతున్న ఆకాళీదళ్

పంజాబ్ లో పట్టుకోల్పొతున్న ఆకాళీదళ్

పంజాబ్ లో పట్టుకోల్పొతున్న ఆకాళీదళ్
ఛండీఘడ్, మార్చి 11, 
దేశంలో కాంగ్రెస్ తరవాత సుదీర్ఘ చరిత్ర గల రెండో పార్టీ శిరోమణి అకాలీదళ్ (ఎస్ ఏ డీ). స్వాతంత్ర్యం పూర్వమే ఈ పార్టీ పురుడు పోసుకుంది. పంజాబీలు, మరీ ముఖ్యంగా సిక్కుల ప్రయోజనాలే పరిరక్షణ ధ్యేయంగా దీని ప్రస్థానం ప్రారంభమైంది. సిక్కుల ప్రార్థనా మందిరాలైన గురుద్వారాలపై పార్టీకి తిరుగులేని పట్టుంది. కాలక్రమంలో స్థాపిత లక్ష్యాలకు దూరమైంది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబం చేతిలో బందీగా మారిందన్నది చేదు నిజం. పార్టీ, ప్రజల ప్రయోజనాల కన్నా బాదల్ కుటుంబ ప్రయోజనాలే దానికి ముఖ్యమైంది. ఫలితంగా క్రమంగా ప్రజలకు దూరమవుతూ వస్తోంది.2019 లోక్ సభ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని విస్పష్టంగా చాటాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిన్నమొన్నటిదాకా పరోక్షంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన అకాలీదళ్ ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాల్సి ఉంది. స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంపై అసమ్మతిని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందాల్సి ఉంది. అలాంటిదేమీ జరగకపోగా అనూహ్యంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతుచట్టాలకు వ్యతిరేకంగానే చిరకాల మిత్రపక్షమైన భాజపాతో బంధాన్ని తెంచుకుంది. చివరకు పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ సింగ్ కౌర్ మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. అయినా పార్టీని ప్రజలు నమ్మలేదంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో సహజంగానే అకాలీదళ్ విజయ కేతనం ఎగురవేయాల్సి ఉంది. కానీ హర్ సిమ్రత్ సొంత లోక్ సభ నియోజకవర్గమైన భఠిండాలోనే పార్టీ చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 53 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరవాత హస్తం పార్టీ ఇక్కడ విజయ దుందుభి మోగించింది. ఆమె భర్త పార్టీ అధ్యక్షుడైన సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిరోజ్ పూర్ స్థానంలోనూ హస్తం పార్టీ హవా కనపడింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా మొత్తం 8 కార్పొరేషన్లను గెలుచుకుని విజయఢంకా మోగించింది. భఠిండా, అబోహర్, బటాలా, మోగ, కపుర్తల, హోషియాపూర్, పఠాన్ కోట్, మొహాలీ స్థానాలను కైవసం చేసుకుంది. మొహాలీ పేరు చెప్పగానే క్రికెట్ ప్రేమికులకు చటుక్కున గుర్తుకు వస్తుంది. ఇక్కడ తరచూ జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరుగుతుంటాయి. మొత్తం రెండు వేలకు పైగా పురపాలక వార్డుల్లో దాదాపు 1500, 109 పురపాలిక, నగర పంచాయతీలకు దాదాపు వంద స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది.బీజేపీ, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఓట్ల చీలికతోనే కాంగ్రెస్ లబ్ధి పొందిందన్న వాదన ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన అకాలీదళ్ ను ప్రజలు విశ్వసించలేదన్నది వాస్తవం. రైతుల పేరిట ఉద్యమాలు నడిపినా, కేంద్ర సర్కారు నుంచి బయటకు వచ్చినా ప్రజలు దానిని నమ్మలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబం చేతిలో పార్టీ బందీగా మారింది. బాదల్ సుదీర్ఘకాలం సీఎంగా పని చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్, కోడలు హర్ సిమ్రత్ కౌర్ పార్టీ ఎంపీలు. గత కొన్నేళ్లుగా పార్టీలో వేరేవారికి చోటు లేదు. సిక్కుల ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన పార్టీ క్రమంగా సిక్కు మతంలోని సంపన్న ‘జాట్’ వర్గం పార్టీగా మారింది. పంజాబ్ లో జాట్ … బలమైన సామాజిక వర్గం. దీంతో సాధారణ, సామాన్య సిక్కులు పార్టీకి దూరమయ్యారు. కుటుంబ రాజకీయాలతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు స్తబ్దుగా ఉండిపోయారు. దీనికితోడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల అవినీతి కూడా ఒక కారణం. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో, సిక్కుల్లో అకాలీలకు, పట్టణ ప్రాంతాల్లో, హిందువుల్లో భాజపాకు బలం ఎక్కువ. ఈసారి ఈ సూత్రీకరణ పని చేయలేదు.

Related Posts