భగవానుడు ప్రసాదించిన దివ్యమైన వరం నూరేళ్ల జీవితం. ఈ జీవితం మూడింటితో ముడివడి ఉంది. సమరం, సాధన, ఆస్వాదన- ఈ త్రికోణ రూపమే జీవితం.
పుట్టుక నుంచి పుడమి గర్భంలోకి వెళ్ళేవరకు జీవితం ఓ సమరాన్ని తలపిస్తుంది. బతుకు పోరాటం, బతికించడం కోసం ఉనికిని కాపాడుకోవడం, బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశల్లో ధర్మాచరణ, కుటుంబ సౌఖ్యం, సంతానం, ప్రయోజకత్వం, వృద్ధాప్యం, బాధలు, వ్యాధులు... అంతా ఓ సంగ్రామం.
గ్రహరాశుల గమనస్థితి నుంచి సూక్ష్మ జీవరాశి వరకు క్రియాశీల వైఖరి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. చేతనత్వానికి సంకేతం. సృష్టిలోని క్రియాధర్మం ఆగిపోతే జడత్వం ఆవహించి, రూప, నామ రహితంగా ఉండిపోతుంది. సృష్టి ధర్మం కొనసాగే క్రమంలో ఘర్షణ తప్పనిసరి. అలాగే మానవాళి జీవితంలో అనుభవాల రాపిళ్లు తప్పేవి కావు. శరీరాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించి మానవుడు జీవనసమరంలో విజేతగా నిలవాలి. సమయానుకూలంగా, సావధానంగా రాదు సమరం. అనునిత్యం, అనుక్షణం సమర వాతావరణమే.
వైవాహిక జీవితం, గృహస్థాశ్రమం... నల్లేరుమీద నడక కావు. సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకుంటాడు యజమాని. తన వృద్ధాప్య దశ హాయిగా సాగిపోవాలనుకుంటాడు. కానీ క్షణక్షణానికి మారే మనస్తత్వ వైఖరులు వాతావరణాన్ని అశాంతి పాలు చేయవచ్చు. పెను సమస్యలు తీరక పట్టి పీడించనూవచ్చు. వృద్ధాప్యమొక శాపంలా పరిణమించ వచ్చు. ఏ దశ కూడా వడ్డించిన విస్తరి కాదు. కడ దాకా పోరాటమే. ఎప్పటికప్పుడు బలాన్ని సమకూర్చుకుంటూ సమర క్షేత్రంలో పోరు సల్పవలసిందే.
జీవితం విసిరే సవాళ్లను సాధనా సంపత్తితో ఎదుర్కోవాలి. సాధన అద్వితీయమైన శక్తి. అది చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. సాధనాజగత్తులో జాడ్యానికి, సోమరితనానికి తావుండదు. సాధనలో తొందరపాటు, తొట్రుపాటు ఉండవు. ఏదో ఒక్క విజయంతో ఆగిపోయేది కాదు సాధన. ‘సాధనమున పనులు సమకూరు ధర లోన’ అన్నాడు ప్రజాకవి వేమన. జీవితంలో అవకాశాలు అందినట్లే అంది జారిపోతాయి. ఫలితాలు తారుమారు కావచ్చు. భవిష్యత్తు చీకటిమయంగా తోచవచ్చు. ఆశించిన లక్ష్యం అందుకోలేకపోవచ్చు. సాధనే సర్వత్రా విజయవంతమని గ్రహించినవారు- జీవితం విసిరే ఏ సవాలునైనా నవ్వుతూ స్వీకరిస్తారు.
విరామంతో ‘ఇక విశ్రాంతి కాలం’ అంటూ కాలాన్ని వృథాగా వెళ్లబుచ్చడం అంటే- అది కొరివితో తలగోక్కోవడమేనని తెలుసుకోవాలి. కాళ్లు చేతులు, మనసు పనిచేస్తున్నంతవరకు సాధనామయ జగత్తులో శ్రమించవలసి ఉంటుంది మనిషి. భక్తి ప్రపంచంలో నవ విధ భక్తి మార్గాలు సాధనా జగత్తే.
గృహిణి జీవితమంతా ఓ అద్భుత సాధనా ప్రపంచమే. వైవాహిక జీవితం, ఇల్లు చక్కదిద్దుకునే నైపుణ్యం, వంట-వార్పు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యులందరికీ అనుకూలమైన మనఃస్థితిని కలిగి ఉండటం, సభ్యత, సంస్కారాలు నేర్పే గురువులా భాసిల్లడం, పుట్టింటికీ మెట్టినింటికీ వారధిలా ఉండటం- ఇవన్నీ అనేక కోణాల్లో సాగే గొప్ప సాధనలే!
ధ్యానంతో మమేకమయ్యే సాధకుడు ఆనందాన్ని పొందుతాడు. ఒకరి ద్వారా పొందేది కాదు ఆనందం. ఎవరికి వారే ఆ స్థితిని సాధించుకోవాలి. ఎవరైనా జీవితంలోని దశలను, అవి తెచ్చిపెట్టే ఫలితాలను ఆస్వాదించాలి. కుంగుబాటును, సంతోషాతిశయాలను సమానంగా స్వీకరించగలగాలి. సాధనతో ఒడుదొడుకులను వివేకంతో అధిగమించాలి. నూరేళ్ల జీవనఫలాన్ని, దాని మాధుర్యాన్ని ఆస్వాదించాలి!