YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దాడి..మళ్లీ యూటర్న్

దాడి..మళ్లీ యూటర్న్

విశాఖపట్టణం, మార్చి 13, 
విశాఖ జిల్లాలో సీనియర్ నేత. మాజీ మంత్రి కూడా. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. నిబధ్ధతకు, నిజాయతీకు మారు పేరుగా ఉండేవారు. ఆయన మేధావి వర్గానికి చెందిన వారని కోరి మరీ ఎంపిక చేసుకున్నారు ఎన్టీయార్. అలా 1985లో శాసన సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో దాడి వీరభద్రరావుని అనకాపల్లి వంటి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా స్వయంగా నిలబెట్టి అన్నగారు గెలిపించుకున్నారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన దాడి వీరభద్రరావు మాస్టారు అనేక మార్లు ఎమ్మెల్యేగా, ఒక మారు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన చాల సార్లు మంత్రిగా కీలకమైన బాధ్యతలను నిర్వహించారు.ఇక దాడి వీరభద్రరావు మీద ఒక్క ఒకే ఒక మచ్చ ఏంటి అంటే ఆయనలో రాజకీయ నిలకడ లేదని, నిజానికి 2012 వరకూ దాడి టీడీపీనే అట్టిపెట్టుకుని ఉన్నారు. కొత్త పార్టీలు ఎన్ని పుట్టినా కూడా ఆయన ఆ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. కానీ చంద్రబాబు మాట ఇచ్చి మరీ మరోసారి ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వలేదన్న ఆవేశంలో ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కారణంగా టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఆ ఆవేశంలో ఆయన వైసీపీలో చేరారు. దానికి తగిన ప్రతిఫలం కూడా పొందారు. కొడుకు రత్నాకర్ కి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు. కానీ కుమారుడు ఓడాడు. దాంతో దాడి వీరభద్రరావు మళ్లీ వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత టీడీపీలో చేరేందుకు యత్నించారు. ఇక మరో మారు ఎన్నికల వేళ వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు. ఇలా దాడి వీరభద్రరావు అటూ ఇటూ తిరగడం వల్ల ఇమేజ్ కొంత దెబ్బ తింది.ఇక 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరినా టికెట్ దక్కలేదు. మరో వైపు చూస్తే వైసీపీకి పవర్ దక్కినా నామినేటెడ్ పదవి కూడా దాడి వీరభద్రరావుకి చిక్కలేదు. దాంతో దాడి విసిగి ఏడాది గా పూర్తిగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జగన్ ఈ మధ్య గుర్తు పెట్టుకుని మరీ పాత కాపులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం, రానున్న రోజుల్లో మరిన్ని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతూండడంతో దాడి మాస్టార్ లో ఒక్కసారిగా చురుకు పుట్టింది అని చెబుతున్నారు. ఇప్పటిదాకా శాసన మండలి ఉంటుందో ఉండదో అన్న డౌట్ లో పడిన ఆయనకు ఇక అది కంటిన్యూ అవుతుంది అన్న భరోసా కూడా దక్కడంతో మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు.దాడి వీరభద్రరావు అంటే జగన్ కి గౌరవం ఉంది. అందుకే ఆయన తనను గతంలో ఘాటుగా విమర్శించినా కూడా మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. అయితే దాడి వీరభద్రరావు కోరినట్లుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇస్తారా అన్నదే ఇక్కడ చర్చ. సీనియర్ లీడర్లను, వయసు రిత్యా పెద్దవాళ్ళను జగన్ పక్కన పెడుతున్నారు. మాజీ మంత్రి సి రామచంద్రయ్య అందుకు మినహాయింపు అయితే అవవచ్చు. కానీ దాడి లాంటి వారి సీనియర్ల సేవలను కేవలం పార్టీ వరకే వాడుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. దాడి వీరభద్రరావుకి మంచి వాగ్దాటి ఉంది. పైగా చంద్రబాబును చెడా మడా తిట్టే దమ్మూ ధైర్యం కూడా ఉన్నాయి. బాబు లోగుట్టు బాగా తెలిసిన వారు కూడా. అందువల్ల దాడి సేవలు పెద్దల సభకు అవసరం అనుకుంటే జూన్ లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే స్థానాలలో ఒక ఎమ్మెల్సీ పదవిని కేటాయించవచ్చు అన్న ప్రచారం అయితే సాగుతోంది. మొత్తానికి దాడిలో ఆశలు రేపి చురుకుపుట్టించిన ఘనత మాత్రం జగన్ దే అంటున్నారు.

Related Posts