అనంతపురం, మార్చి 13,
టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మునిసిపల్ ఎన్నికల ముంగిట్లో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం.. అనంతపురంలోని రాయదుర్గంలో పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలు ముందు పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. చాలా మంది నాయకులు జంపింగులు చేస్తున్నారు. అది కూడా వైసీపీ కీలక నాయకుడు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీలో చేరుతుండడం.. కాల్వ శ్రీనివాసులుకు ఇబ్బందిగా మారింది. కాల్వ రాయదుర్గం పార్టీ ఇన్‌చార్జ్‌గానే కాకుండా.. అనంతపురం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు అగ్నిపరీక్షగా మారాయి. పార్టీ నాయకులు కూడా తమ పరువు కాపాడుకుని… పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాయదుర్గంలో గెలుపు మాట అట ఉంచితే కనీసం పార్టీ పరువు నిలబెట్టుకునేలా కౌన్సెలర్ సీట్లు దక్కించుకునేందుకు కూడా ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పార్టీ కౌన్సెలర్ అభ్యర్థులను మించి మరీ ఆయన టెన్షన్ పడుతున్నారు. అయితే కాల్వ శ్రీనివాసులు దూకుడుకు బ్రేకులు వేసేందుకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కసితో పని చేస్తున్నారు.కాల్వ శ్రీనివాసులు ప్రధాన అనుచరులుగా ఉన్న మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను పార్టీలోకి లాగేసుకున్నారు. వీరిద్దరిని విప్ కాపు రామచంద్రారెడ్డి భారీ ఆఫర్లతో వైసీపీలో చేర్చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు కీలక నేతలతో పాటు పట్టణంలో పలు వార్డుల్లో టీడీపీ కౌన్సెలర్ అభ్యర్థులను కూడా వైసీపీలో చేర్చేసుకుంటున్నారు. వలసలతో పరువు కాపాడుకునేందుకు కాల్వ శ్రీనివాస్ పాట్లు పడుతున్నారు. దీంతో కాల్వ.. టీడీపీ అభ్యర్ధులను కర్ణాటకకు తరలించారు. సుమారు 30 మందిని రహస్య ప్రాంతాలకు తరలించి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవద్దంటూ పలువురు టీడీపీ అభ్యర్థులను కాల్వ బతిమలాడాల్సి వచ్చింది. మొత్తానికి కాల్వ శ్రీనివాసులు పరువు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే