విమాన వైఫై చాలా ఖరీదు..
విమాన చార్జీల్లో 30 శాతం దాకా వసూలు..
విమానాల్లో త్వరలోనే వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. నెట్ వాడుకోవచ్చు.. సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకోవచ్చు.. స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. అయితే, అది చాలా ఖరీదుతో కూడుకున్నది సుమా. విమాన చార్జీలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ ఆదేశాలతో విమానంలో వైఫై సేవలను విమానయాన సంస్థలు ప్రారంభించబోతున్నా కూడా.. వినియోగదారులపై అది పెను భారాన్నే మోపనుంది. 30 నిముషాల నుంచి గంట వరకు రూ.500 నుంచి రూ.1000 వరకు వినియోగదారులపై భారం పడనుంది. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం ఇన్మార్‌శాట్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ మార్గాల్లో ఇన్‌ఫ్లైట్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ చార్జీలు రూ.1200 నుంచి రూ.2,500 దాకా ఉండబోతున్నాయి.
ఈ నేపథ్యంలో వినియోగదారులకే కాకుండా విమానయాన సంస్థలకూ ఆ చార్జీలు భారంగానే పరిణమించనున్నాయి. ఖండాంతర, దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఇన్‌ఫ్లైట్ వైఫై వెసులుబాటు ప్రయోజనం చేకూరుస్తుందని ఓ విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాకుండా భారత గగనతలంలో ఉన్నప్పుడు వైఫైని స్విచాఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం గురించి చర్చిస్తున్నామని, దానిపై పూర్తి నిర్ణయం తీసుకునేముందు దాని చార్జీలు, వైఫైకి ఉన్న డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రైవేటు విమానయాన సంస్థ అధికారి ఒకరు సూచించారు. ఇక, వైఫై సేవలను అందించేందుకు గానూ విమానాల్లో యాంటెన్నాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, దేశీయ విమానాల్లో వైఫై వెసులుబాటు మంచిదే అయినా అంతర్జాతీయ మార్గాల్లో మాత్రం అది అంతగా ఉపయుక్తం కాదని భారత విమాన ప్రయాణికుల సంఘం జాతీయ అధ్యక్షుడు డీ సుధాకర రెడ్డి అన్నారు. అత్యవసర సమయాల్లో దాని వల్ల లాభాలుంటాయని, తక్కువ ధర కలిగిన విమానాలకు వైఫై వెసులుబాటు అంతగా సూట్ కాదని చెప్పారు.