YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

బడ్జెట్ అంతా ఆన్ లైనే...

బడ్జెట్  అంతా  ఆన్ లైనే...

హైదరాబాద్, మార్చి 13, 
రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రక్రియపై అంతా ఆసక్తి నెలకొన్నది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ 14న ముగియ నుంది. 17న ఫలితాలు రానున్నాయి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాల ప్రక్రియ ప్రారంభమవు గుండగా, మరోవైపు ఎన్నికలు ముగియనున్నాయి. ఈనెల 18న రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా సర్కారు నిర్ణయించుకుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ తయారీలో తలమునకలైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు బడ్జెట్‌ ప్రక్రియపై దృష్టిసారించారు. ఇప్పటికే రెండుసార్లు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు అరణ్యభవన్‌లో ఆయా శాఖలతో భేటి అయ్యారు. గత బడ్జెట్లను సమీక్షించి, 2021-22 బడ్జెట్‌ రూపకల్పనపై సమాలోచనలు చేశారు. సాధారణంగా బడ్జెట్‌ రూపొందించేందుకు తీవ్రమైన కసరత్తే జరుగుతుంది. ఆదాయ, వ్యయాలను బేరీజుకుని ఆ ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతల ప్రకారం కొత్త కేటాయింపులు చేస్తారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ కేంద్రంగా ఆదాయం బాగా వస్తున్నది. అయితే గత ఏడాది కరోనా వైరస్‌ దేశాన్నీ, రాష్ట్రాన్ని చుట్టిముట్టి అతలాకుతలం చేసిన నేపథ్యంలో బడ్జెట్‌ను మరింత జాగ్రత్తగా తయారుచేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకోవడం, వాటిని కాస్త రహస్యంగా తయారుచేయడం జరిగేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరింత గోప్యతను సర్కారు ప్రదర్శిస్తున్నది. గతంలో మాన్యువల్‌ పద్ధతి(ఫైళ్లు)లో బడ్జెట్‌ పద్దును తయారుచేసి సీఎంకు సమర్పించే ఆనవాయితీ ఉండేది. మూడేండ్ల నుంచి దాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చేశారు. ఒక శాఖ పరిధిలో బడ్జెట్‌ను ముగ్గురు, లేదా నలుగురు అధికారుల ప్రత్యక్షంగా మాత్రమే చూడగలుగుతారు. సంబంధిత శాఖలోని మొత్తం అధికారులకు కూడా తెలిసే అవకాశం లేదు. దీంతో బడ్జెట్‌ గురించి ఏ ఒక్క అధికారిని లేదా హెచ్‌వోడీలను కదిపినా 'టాప్‌ సీక్రెట్‌' అంటూ దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 'కీప్‌ సీక్రెట్‌' అని సర్కారు చెప్పిందని అంటున్నారు. గతంలో చేసిన కేటాయింపులకు సంబంధించిన వివరాలు తెలిసినా, ఎంత ఖర్చు చేశారనే వివరాలను చెప్పడానికి మాత్రం ససేమిరా అంటున్నారు. 'ఏలాంటి విషయం లీక్‌ అయినా మాకు తలనొప్పి..ఎందుకు ఆ చిక్కులు కొనితెచ్చుకోవాలి'' అని మిషన్‌ భగీరథ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉంది. మామూలుగానైతే సంబంధిత శాఖ మంత్రి, హెచ్‌వోడీలతో చర్చిస్తారు. గతంలో సెక్షన్‌ అధికారుల అభిప్రాయాలూ తీసుకునేవారు. ఇప్పుడా విధానానికి స్వస్తి పలికారు. గత మూడు సంవత్సరాల నుంచి ఆన్‌లైన్‌ పద్ధతి వచ్చాక పూర్తిస్థాయిలో నియంత్రణ పెట్టారు. ముగ్గురు, నలుగురికి మినహా ఇతరులెవరికీ తెలియనివ్వడం లేదు. 'గతంలో మమ్మల్నీ కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలు అడిగేవారు..ఇప్పుడు పట్టించుకోవడం లేదు' అని పంచాయతీరాజ్‌ శాఖలో సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక గతంలో ప్రతి శాఖా మంత్రి , తన హెచ్‌వోడీ, ఇతర అధికారులతో తన శాఖ పరిధిలోని కార్యకలాపాల కోసం అవసరమైన నిధులకు సంబంధించి సమీక్ష చేసేవారు. అనంతరం ఆమేరకు నిధులను ప్రభుత్వానికి ప్రతిపాదించి తెప్పించుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ ఆనవాయితీని తుంగలో తొక్కేశారు. పాత బడ్జెట్‌ను మరోసారి పరిశీలించి, దానికి అనుగుణంగా పెంచడమో, లేదా తగ్గించడమో చేసే పద్ధతి వచ్చింది. గోప్యత పాటించడం మూలంగా ఆయా శాఖల అవసరాలు, ప్రాధాన్యతలు, కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి సమకూర్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ వ్యవస్థతో పూర్తిగా ఉన్నతాధికారుల పరిధిలోనే బడ్జెట్‌ ఖరారు అవుతుండటం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాత్ర తక్కువగా ఉండటంతో కొంతమేరకు బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అన్యాయం జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే ప్రభుత్వ ప్రవేశపెట్టే బడ్జెట్లకు, ఖర్చు చేసే దానికి చాలా తేడా ఉంటున్నది. 2018-19 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ లెక్కలను పరిశీలించినప్పుడు రూ.1,74,453 కోట్లను సర్కారు శాసనసభలో సమర్పించింది. అయితే ఆ బడ్జెట్‌ను రూ. 1,61,856 కోట్లుగా మళ్లీ సవరించింది. కానీ, ఖర్చు మాత్రం రూ. 1,57,160 కోట్లకే పరిమితం చేసింది. ఇలా పూర్తిస్థాయి లెక్కలు రావడానికి చాలా సమయం పడుతున్నది. అయితే అధికారులు మాత్రం బడ్జెట్‌ పద్దును, ఖర్చును చెప్పడానికి ఇష్టపడటం లేదు. కాగా, బడ్జెట్‌కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్చంధ సంస్థలు ఆయా అభివృద్ధి, సంక్షేమ శాఖలకు నిధుల అవసరం ఏమేరకు ఉందో వినతిపత్రాల రూపంలో తమ అంచనాలిచ్చేవి. ఇప్పుడా సంస్కృతికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే ఇటు సీఎంగానీ, అటు మంత్రులు, ఉన్నతాధికారులు గానీ వారి వినతిపత్రాలు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. నిరాకరిస్తున్నారు కూడా. దీంతో ప్రజల అవసరాల మేరకు కేటాయింపులు ఉండటం లేదనే వ్యాఖ్యానాలు రాజకీయ విశ్లేషకులు, మేధావుల నుంచి వస్తున్నాయి.

Related Posts