YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క్రెడిట్ కోసం తాపత్రయం

క్రెడిట్ కోసం తాపత్రయం

నల్గొండ, మార్చి 13, 
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ముందే జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. జానారెడ్డి కూడా గత కొద్ది వారాలుగా నాగార్జున సాగర్ లో పర్యటిస్తూ గ్రూపు మీటింగ్ లు పెడుతున్నారు. కులాల వారీగా, గ్రామాల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ జానారెడ్డి ఉప ఎన్నికలలో దూకుడుగా ఉన్నారు. అయితే తన గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్న జానారెడ్డి క్రెడిట్ అంతా తనకే దక్కాలని భావిస్తున్నారు.తన కుమారుడు రఘువీర్ రెడ్డి మీద ఆర్థికపరమైన బాధ్యతలను జానారెడ్డి పెట్టారు. ప్రచారం మొత్తం తానొక్కడినే చూసుకోవాలని నిర్ణయించారు. ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి జానారెడ్డి ప్రచారం చేయరు. ఎవరైనా కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేతలు వచ్చినా వారి సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. నేతల సమావేశాల బాధ్యతలను జానారెడ్డి కుమారుడికి అప్పగించారు. దుబ్బాక లో జరిగినట్లు కాంగ్రెస్ నేతలను మండలాల వారీగా నియమించేందుకు జానారెడ్డి ఇష్టపడటం లేదు.నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తనకు నమ్మకమైన నేతలనే ఇన్ ఛార్జులగా నియమించుకోవాలని జనారెడ్డి భావిస్తున్నారు. బయట నుంచి వచ్చిన నేతలకు ఇన్ ఛార్జిలుగా అవకాశం ఇవ్వకూడదని ఆయన పార్టీ హైకమాండ్ కు తెలిపారు. నాన్ లోకల్ అని ముద్రపడే అవకాశముందని, అధికార పార్టీ సానుభూతి పరంగా గెలవాలని చూస్తుందని, అందుకే తనకు నమ్మకమైన వారినే మండల స్థాయి ఇన్ ఛార్జులుగా నియమించుకుంటానని జానారెడ్డి తెగేసి చెప్పినట్లు తెలిసింది.ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యనేతలను ఇన్ ఛార్జులుగా నియమిస్తే సమన్వయం చేసుకోవడం కుదరదని కూడా జానారెడ్డి అభిప్రాయపడుతున్నారు. ప్రచారం కూడా ఆర్భాటం లేకుండా చేయాలన్నది జానారెడ్డి ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటికే జానారెడ్డి సాగర్ లోని అన్ని ప్రాంతాలను ఒకసారి చుట్టివచ్చారు. తన సమావేశాలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో గెలుపు తనదేనన్న ధీమాలో ఉన్నారు. అందుకే గెలుపు క్రెడిట్ తనకే దక్కాలని జానారెడ్డి భావిస్తున్నారు.

Related Posts