YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆనం వివేకానందరెడ్డి కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు వీఆర్ కాలేజీలో బీకాం చేశారు. ఆనం వివేకానందరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనం వివేకానందరెడ్డి మూడుసార్లు 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీమంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి నలుగురి కుమారులలో పెద్దోడు. పెద్దనాన్న ఏ.సి.సుబ్బారెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ అరంగ్రేట్రం చేసారు. 1983లోనే తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చినా, వయసులో పెద్దోడైన ఆయనకు మాత్రం ఎమ్మెల్యే అయ్యే అవకాశం 45ఏళ్ళ వయసుకు గాని రాలేదు. 1983 నుండి తెలుగుదేశంలో వుండి 1985లో కొంత కాలం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్గా కూడా పనిచేసిన వివేకాకు ఆ పార్టీలో వున్నంతకాలం అంతకుమించిన అవకాశాలు రాలేదు. 1985ఎన్నికల్లో నెల్లూరు సీటును ఆశించినా ఇవ్వలేదు. 1989ఎన్నికల్లోనూ ఆయనకు మొండిచేయే చూపారు. దీంతో 1992లో కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆయనకు 1995లో నెల్లూరు మున్సిపల్ ఛైర్మెన్ కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న ఆ కాలంలో వివేకా 36ఓట్లతేడాతో వై.టి.నాయుడుపై సంచలన విజయం సాధించారు. 1999ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేను కావాలనుకున్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్ధన్రెడ్డిని సైతం ఢీకొట్టి టికెట్ తెచ్చుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా డేగా నరసింహారెడ్డిపై గెలుపు సాధించారు. ఐదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా విలక్షణ పాత్ర పోషించారు. 2004 ఎన్నికల్లో మళ్ళీ నెల్లూరు నుండే రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. సరిగ్గా అప్పుడే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, వై.యస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా రాజకీయాల్లో ఆనం హవా మరోసారి మొదలైనట్లయ్యింది. ఆనం సోదరులు నెల్లూరుజిల్లాలో వై.యస్.కు ముఖ్యఅనుచరులుగా ముద్రపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో ఆనం వర్గం ఏర్పడింది. 2007లో వై.యస్. క్యాబినెట్లో ఆనం రామనారాయణరెడ్డి మంత్రయ్యారు. వై.యస్. కొలువులో రామనారాయణరెడ్డి మంత్రి అయ్యాక ఆనం జోరు పెరిగింది.  2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కొత్తగా ఏర్పడ్డ నెల్లూరు రూరల్ నుండి పోటీ చేసిన వివేకా ప్రజారాజ్యం అభ్యర్థి తన సమీప బంధువు ఆనం వెంకటరమణారెడ్డితో గట్టిపోటీనెదుర్కొని 3131ఓట్లతో అతి కష్టం మీద గట్టెక్కారు. 2009 సెప్టెంబర్లో వై.యస్.రాజశేఖరరెడ్డి మరణం చాలామంది కాంగ్రెస్ నాయకుల జీవితాలలో పెనుమార్పులు తెచ్చింది. చాలామంది కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా తెరమరుగయ్యారు. కొందరు గత వైభవాన్ని కోల్పోయారు. వారిలో ఆనం వివేకా కూడా వున్నారు. వై.యస్. మరణానంతరం తొలిరోజుల్లో జగన్కు అండగా నిలిచి ఆయన తరపున గట్టిగా పోరాడిన వివేకా ఆ తర్వాత కొద్దిరోజులకే తన వాణిని మార్చారు. జగన్కు వ్యతిరేకంగా గళం విప్పారు. తెలుగుదేశం నాయకులు కూడా జగన్పై ఆరోపణలు చేయనంతగా వివేకా ఆరోపణలు చేసారు. అనంతరం రాష్ట్ర విభజనతో ఏపిలో కాంగ్రెస్ పతనమైంది. 2014 ఎన్నికల చివరి వరకు సీఎం కుర్చీ మీద ఆశతో ఆనం సోదరులు కాంగ్రెస్లోనే వుండిపోయారు. 2014 ఎన్నికల్లో వివేకా పోటీ చేయకుండా నెల్లూరు నగరం నుండి తన కొడుకు ఏ.సి.సుబ్బారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్ధిగా దించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది. 2015లో ఆనం వివేకా, ఆనం రామనారాయణరెడ్డిలు తెలుగుదేశంలో చేరారు. పార్టీలో చేరేటప్పుడు ఆనం వివేకాకు ఎమ్మెల్సీని, ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. అయితే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్ఛార్జ్ అయితే ఇచ్చారు గాని ఎమ్మెల్సీ విషయంలో వివేకాకు మొండిచేయి చూపారు. దీనికితోడు పార్టీలో ఆనం బ్రదర్స్కు అవమానాలే మిగిలాయి. కాంగ్రెస్లో నెల్లూరు జిల్లాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆనం సోదరులకు టీడీపీలో కనీసం పార్టీ సమావేశాలకు కూడా ఆహ్వానం కరువైంది. ఆనం 'ఇక లేరు' అనే విషయం ఆయన అభిమానులు, మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

Related Posts