కోల్‌కతా మార్చి 13
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా శనవారంతృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదో కొత్త ట్విస్ట్. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాయ్‌పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా చేశారు. 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా.. 2018లో బీజేపీకి స్వస్తి పలికారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బెంగాల్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తన స్వంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి సీఎం మమతా బెనర్జీ.. నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసింద. అయితే టీఎంసీలో కీలకనేత అయిన సువేందు అధికారి గత ఏడాది ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 8 దశల్లో సాగనున్న బెంగాల్ అసెంబ్లీ ఫైట్.. ఈసారి మహారసవత్తర పోరును తలపిస్తోంది.తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల దృఢత్వంలోనే ప్రజాస్వామ్యం బలం ఉంటుందని, న్యాయవ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు బలహీనమైనట్లు యశ్వంత్ తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌జీ పాలన సమయంలో బీజేపీ ఏకాభిప్రాయంపై నడిచేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అణిచివేయడం, స్వాధీనం పరుచుకోవడంపైనే దృష్టి సారించిందన్నారు. అకాలీదళ్, బీజేడీ.. బీజేపీని వీడాయని, ఆ పార్టీతో ఇప్పుడు ఎవరున్నారని యశ్వంత్ ప్రశ్నించారు. నందీగ్రామ్‌లో దీదీపై అటాక్ ఘటన తర్వాతే.. టీఎంసీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు యశ్వంత్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.