YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇంకా సుప్రీమ్ లో సమసిపోని వివాదం

ఇంకా సుప్రీమ్ లో సమసిపోని వివాదం

సుప్రీంకోర్టును ఇబ్బంది పెడుతున్న పలు సంస్థాగత అంశాలతో పాటు.. కోర్టు భవిష్యత్తు గురించి వివరంగా చర్చించేందుకు ఫుల్‌కోర్టును సమావేశపరచాలని సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను కోరారు.జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబరు 2న పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టాల్సి ఉంది. ఒక జడ్జితో పాటు మరో సీనియర్ మహిళా న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కొలీజియం ఇచ్చిన ప్రతిపాదన ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. దీంతో అసలు సుప్రీంకోర్టు ఉనికే ప్రమాదంలో పడిందని, దీనికి ఆపరేషన్ అవసరమని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. ఇక జస్టిస్ జాస్తి చలవేుశ్వర్ అయితే, న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని గురించి చర్చించేందుకు ఫుల్‌కోర్టును సమావేశపరచాలని కోరారు.  నిజానికి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడానికి ఒక రోజు ముందే ఈ లేఖ రాసినా, ఇప్పుడు అది బయటపడింది. సోమవారం ఉదయం నాటి తేనీటి సమావేశంలోనే ఈ లేఖ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అందుకే ఆ రోజు సమావేశం 20 నిమిషాల పాటు జరగడం, తత్ఫలితంగా కోర్టు కార్యకలాపాలు 15 నిమిషాలు ఆలస్యం కావడం లాంటివి సంభవించాయి. ఫుల్‌కోర్టును సమావేశపరచాలని కేవలం రెండే లైన్లతో రాసిన లేఖపై జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్ ఇద్దరూ సంయుక్తంగా సంతకం చేశారు. మార్చి 21న తొలిసారి ఈ డిమాండును జస్టిస్ జాస్తి చలవేుశ్వర్ లేవనెత్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 9న జస్టిస్ కురియన్ జోసెఫ్.. సుప్రీంకోర్టులో ఉన్న సమస్యలపై చర్చించేందుకు ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో బెంచి ఏర్పాటుచేయాలని అడిగారు. సంప్రదాయం ప్రకారం చూస్తే, న్యాయువ్యవస్థకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయం ఉన్నప్పుడు మొత్తం అందరు జడ్జీలతో కూడిన ఫుల్ కోర్టు సమావేశం ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జరుగుతుంది. వెంకయ్య నాయుడు అభిశంసన తీర్మాన నోటీసును తిరస్కరించిన తర్వాత సోమవారం నాటి ఉదయపు తేనీటి సమావేశం జరిగింది. అయితే అప్పుడు మాత్రం ఫుల్ కోర్టు గురించి ప్రధానన్యాయమూర్తి ఏమీ చెప్పలేదని సమాచారం. కానీ జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్ మాత్రం అభిశంసన అంశాన్ని పక్కన పెట్టి.. కోర్టులో సమస్యల గురించి చర్చించడం ముఖ్యమని భావించారు. 

Related Posts