కమలాన్ని దెబ్బతీసిన ఓవర్ కాన్ఫిడెన్స్
విజయవాడ, మార్చి 15,
భారతీయ జనతా పార్టీ కి మున్సిపల్ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. బీజేపీకి ఏపీ ప్రజలు చెంప చెళ్లుమనిపించారు. వన్ సైడ్ గా వెళితే ఎలా ఉంటుందో కమలం పార్టీకి తమ ఓటు ద్వారా చూపించారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో బీజేపీ కనీస స్థానాలను కూడా సాధించుకోలేక పోయింది. అక్కడక్కడ వార్డులు గెలుచుకోవడం మినహా ఎక్కడా బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ కంటే జనసేన పార్టీయే బెటరని ఈ ఫలితాలను చూస్తే చెప్పక తప్పదు.ఏపీలో బీజేపీ ఇక బలపడే సూచనలు లేవని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. నిజానికి బీజేపీ కి ఉన్న బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే. అర్బన్ ప్రాంతాల్లో హిందుత్వ నినాదాన్ని అందుకోవడం, మోదీ ఇమేజ్ పనిచేయడం వంటి కారణాలతో మున్సిపల్ ఎన్నికల్లో కనీస పనితీరును మెరుగుపరుస్తామని బీజేపీ నేతలు భావించారు. కానీ మున్సిపల ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే మాత్రం ఇక బీజేపీ దుకాణం బంద్ చేసుకోవడమే బెటర్ అని ప్రజలు తీర్పు చెప్పినట్లయింది.ఏపీ బీజేపీకి తొలి నుంచి కష్టాలే. ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం వరకూ అన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కనీసం రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని పట్టణ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడంలో నాటకాలు తప్ప నిజానికి బీజేపీ చేసిందేమీ లేదన్నది ఈ తీర్పు ద్వారా ప్రజలు బీజేపీకి చెప్పదలచుకున్నారు.మరోవైపు పెరుగుతున్న పెట్రోలు ధరలు, నిత్యావసరాల ధరలు పెరుగుదల వంటివి ఏపీ బీజేపీని దారుణంగా దెబ్బతీశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ బీజేపీకి శాపంగా పరిణమించాయని చెప్పాలి. ఇక తీర్థయాత్రలు, రథయాత్రలు మాని రాష్ట్ర బీజేపీనేతలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై దృష్టి పెడితేనే భవిష‌్యత్ ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికపై కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవడం వేస్ట్ అనే చెప్పాలి. ఏపీ ప్రజలు బీజేపీని పూర్తిగా రాష్ట్ర సరిహద్దులు దాటించాలని నిర్ణయించినట్లే ఈ ఫలితాలు కన్పిస్తున్నాయి.