చెక్కు చెదరని జగన్ చరిష్మా
విజయవాడ, మార్చి 15
ఊహించినట్లే జరిగింది. సంక్షేమ పథకాలు పనిచేశాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వైసీపీ పక్షాన ప్రజలు నిలిచారని చెప్పక తప్పదు. నిజానికి పంచాయతీల్లో అత్యధిక స్థానాలను గెలుచుకున్నా వైసీపీ తొలి నుంచి పల్లె ప్రాంతాల్లో పట్టు ఉండటంతో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. దీంతో పాటు పల్లె ప్రాంతాల్లో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా పనిచేశాయని అన్నారు. దీంతో పాటు ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలను కూడా వైసీపీ ఎదుర్కొంది.కానీ మున్సిపాలిటీ విషయాలకు వచ్చే సరికి పట్టణ ప్రాంతాలు. గత రెండేళ్ల జగన్ పాలనకు ఈ తీర్పు అద్దం పడుతుందని భావించారు. రెండేళ్ల నుంచి అభివృద్ధి లేకపోవడం, కేవలం సంక్షేమ కార్యక్రమాలపైనే జగన్ దృష్టి పెట్టడంతో పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, తాగునీరు, అన్నా క్యాంటిన్లు ఎత్తివేయడం వంటి సమస్యలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావించారు.కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే దాదాపు అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అంటే పట్టణ ప్రాంత ఓటర్లు కూడా జగన్ వైపే ఉన్నారని దీనిద్వారా స్పష్టమయింది. మున్సిపల్ ఎన్నికలపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని భావించారు. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడం కూడా జగన్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందేమోనని భావించారు. కానీ అత్యధిక శాతం మంది ప్రజలు వైసీపీ పక్షానే నిలిచారు.కనిగిరి లాంటి మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించడం దీనికి అద్దం పడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు ఈ ఎన్నికలు చెక్ పెట్టాయని చెప్పాలి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీకి మరింత ఊపునిచ్చే అంశమనే చెప్పాలి. రెండేళ్ల తర్వాత కూడా జగన్ చరిష్మా ఏమాత్రం చెరిగిపోలేదనే ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.