YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో ఒక్క మగాడు

టీడీపీలో ఒక్క మగాడు

టీడీపీలో ఒక్క మగాడు
అనంతపురం, మార్చి 15,
నిజమే… అన్ని మున్సిపాలిటీలు టీడీపీని ముంచేస్తే ఒక్క తాడిపత్రిలో మాత్రం పసుపు జెండా రెపరెపలాడింది. తాడిపత్రి మున్సిపాలిటీని అధికారికంగా టీడీపీ గెలుచుకుంది. దీనికి ప్రధాన కారణం జేసీ బ్రదర్స్. ముఖ్యంగా తొలి నుంచి వ్యూహాత్మకంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన కుమారుడు ఓటమి పాలయిన తర్వాత ఆయన అక్కడే తిష్ట వేశారు. తన అనుచరుల్లో ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.అంతేకాదు వైసీపీకి ధీటుగా వ్యూహరచన చేయడంలో ముందున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే తాను రంగంలోకి దిగాలనుకున్నారు. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి 24వ డివిజన్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేశారు. నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేయాల్సింది కాదు. ఎందుకంటే ఆయన గతంలోనే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం సంకోచించలేదు. తన అనుచరులకు, పార్టీ క్యాడర్ కు ధైర్యం కల్పించేందుకు వార్డు కౌన్సిలర్ గా పోటీ చేశారు. దీంతో తాడిపత్రి టీడీపీ క్యాడర్ లో ధైర్యం వచ్చింది. ఇక్కడ టీడీపీ క్యాడర్ అనే కంటే జేసీ క్యాడర్ అంటేనే బాగుంటుందేమో. సేవ్ తాడిపత్రి నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తాను తాడిపత్రిలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరంచడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై సానుభూతి కూడా పనిచేసింది. ఆయనపై రవాణా శాఖ కేసులు నమోదు చేసి 50 రోజులకు పైగానే జైల్లో ఉంచింది. జైలు నుంచి బెయిల్ పై రాగానే మరో కేసు నమోదు చేసింది. ఇక తన ప్రత్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లడాన్ని కూడా తాడిపత్రి ప్రజలు హర్షించలేదు. దీంతో జేసీ ఫ్యామిలీపై కొంత సానుభూతి పనిచేసిందని, అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓటమిపాలయినా తాడిపత్రిలో మాత్రం విజయం సాధించింది. ఖచ్చితంగా దీనిని జేసీ విజయంగానే చూడాల్సి ఉంటుంది.

Related Posts