అనంతపురం మార్చి 15,
ఆదివారం వెలువడిన మున్సిపల్ ఫలితాల తర్వాత తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు అధికారపార్టీ వైకాపా ఎత్తులు వేస్తోంది. తాడిపత్రి మున్సిపాలిటీ లో మొత్తం వార్డులు 36 ఉన్నాయి. టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 గెలిచారు. ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే 19 ఓట్లు కావాల్సి ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థితో కలిపి టీడీపీ క్యాంప్లో 20 మంది ఉన్నారు. వైసీపీ ఖాతాలో కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎక్స్ ఆఫిషియో సభ్యులు కీలకంగా మారారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి టీడీపీకి ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో దీపక్ రెడ్డి ఓటు వేసారు. అయితే, ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా దీపక్ రెడ్డిని పరిగణలోకి తీసుకోరాదంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఛైర్మన్ ఎన్నికలో ఏకైక సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు.