తెలంగాణ రాజకీయ వర్గాల్లో కోదండరాం పార్టీ కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా ? లేదా ఏ పార్టీతో అయినా కూటమి కట్టి ఎన్నికల బరిలోకి వెళతారా ? అన్నదానిపై కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇక కోదండరాం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని టీజేఎస్ వర్గాలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.జనగామలో ఇప్పటికే టీజేఏసీ బలంగా ఉంది. ఇప్పడు టీజేఎస్ ఆవిర్భవించడంతో ఆ క్యాడరంతా అందులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న టీజేఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా టీజేఎస్ శ్రేణులు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. మండలాల వారీగా సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో పర్యటించి ప్రజలను సమాయత్తం చేస్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై అటు పార్టీలో, ఇటు క్యాడర్లో వ్యతిరేకత ఉండడం కూడా టీజేఎస్‌కు కలిసివస్తుందని, రాబోయే రోజుల్లో జిల్లాలో టీజేఎస్ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నల్గొండ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆయన అనుచరులు మాత్రం ఆయన్ను జనగామ బరిలో నుంచే పోటీ చేయించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారుపోరుగడ్డలో టీజేఎస్ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత జిల్లా సాధన ఉద్యమంలోనూ నాటి టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. ఇప్పటికీ కోదండరాం జనగామలో క్యాడర్ ఉంది. ఇదే ఊపులో జిల్లాలో తమ సత్తాను చాటేందుకు టీజేఎస్ వ్యూహాలు రచిస్తోంది. పాత జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో తమ బలాన్ని పెంచుకునేందుకు టీజేఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరే విధంగా స్థానిక నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు.మరో వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి గుర్తింపు లేకుండా ఉన్న కొందరు నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్, మండల స్థాయి నాయకులు టీజేఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడ మరోవిషయం ఏమిటంటే.. టీఆర్ఎస్ పాత క్యాడర్లో చాలావరకు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారుల సంఘంగా ఏర్పడ్డారు. రోజురోజుకూ ఈ సంఘం కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఈ సంఘం కూడా టీజేఎస్‌కు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.