విజయవాడ, మార్చి 15,
భారతీయ జనతా పార్టీతో పొత్తు గురించి జనసేన పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఓటమికి బీజేపీ కూడా కారణమని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధిష్టానానికి వివరిస్తామని చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో బీజేపీ వల్ల జనసేన పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పోతిన మహేష్ అన్నారు. తాము ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అందువల్లే పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయామన్నారు. అలాగే విజయవాడలో తమ అభ్యర్థులకు బీజేపీ ఏమాత్రం అండగా నిలబడలేదని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని డివిజన్లలో కనీసం జెండా పట్టుకోవడానికి కూడా లేకుండా పోయారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థుల కోసం జనసైనికులు తీవ్రంగా కష్టపడ్డారని.. కానీ, బీజేపీ నేతలు ఏ మాత్రం సహకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తును ప్రజలు ఒప్పుకోవట్లేదని సంచలన ప్రకటన చేశారు. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి రెండు రోజుల్లో పార్టీ అధిష్టానికి లేఖ రాస్తానని వెల్లడించారు.అలాగే అమరావతి పరిరక్షణ సమితిపై కూడా పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయన్నారు. అలాంటప్పుడు విజయవాడ, గుంటూరు ఎన్నికలను అంత సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? అని నిలదీశారు. అమరావతి రాజధానిని వ్యతిరేకించినవాళ్లకు ఓటు వేయవద్దని ఎందుకు పిలుపు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అమరావతి వ్యతిరేక పార్టీలకు వ్యతిరేకంగా ఓటెయ్యమని ఎందుకు ప్రెస్మీట్ పెట్టలేదని నిలదీశారు. ఎన్నికల్లో అధికార వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ మరోసారి ఘోర వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై జనసేన కీలక నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.