తిరుపతి, మార్చి 15,
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఊపు మీదున్న వైఎస్సార్సీపీ.. తిరుపతి ఉపఎన్నికపై దృష్టి సారించింది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది. త్వరలోనే ఎన్నిక జరగనున్న ఈ స్థానానికి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక్కడి నుంచి బీజేపీ సైతం బరిలో దిగుతోంది.వైసీపీ జోరును చూస్తుంటే.. తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడం నల్లేరు మీద నడకలాగే కనిపిస్తోంది. దుర్గా ప్రసాద్ తనయుడిని శాసన మండలికి పంపుతున్న జగన్ పార్టీ.. ఇక్కడి నుంచి దుర్గా ప్రసాద్ కుటుంబేతరుడికి టికెట్ ఖరారు చేయనుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన తనయుడు లోకేశ్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు.టీడీపీ ఎంతో బలంగా ఉండే విశాఖలోనూ.. వైసీపీ జెండా పాతింది. ఇక్కడ ప్రతిపక్షం గట్టి పోటీ ఇచ్చిందేగానీ.. అధికార పార్టీ హవాను తట్టుకోలేకపోయింది. ఇక చంద్రబాబు సొంత జిల్లాలో జరగబోతున్న ఉపఎన్నికలో టీడీపీ ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.వరుస ఎన్నికల్లో పార్టీ గెలిచిన ఉత్సాహంలో ఉన్న తిరుపతి ఉపఎన్నికలోనూ ప్రచారం చేయబోరని తెలుస్తోంది. ఉపఎన్నికల్లో గెలుపు బాధ్యతలను జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు.. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, రోజాకు అప్పగిస్తారని సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని.. తాను ప్రచారం చేయకపోయినా.. ప్రజలు వెన్నంటి నిలుస్తారనే ధీమాతో సీఎం ఉన్నారట. అందుకే ఇక తప్పదని భావిస్తేనే. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటారని.. లేదంటే మంత్రులు, జిల్లాకు చెందిన నేతలే ఆ బాధ్యతలను తీసుకుంటారని సమాచారం.