ముంబై, మార్చి 15,
దేశంలోకరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల కొద్ది వారాల నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అంతకు ముందు వారంతో పోల్చితే గతవారం 33 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. మరణాలు కూడా 28 శాతం మేర పెరిగి ఆరువారాల గరిష్ఠానికి చేరాయి. గతవారం (మార్చి 8-15) 876 మంది కోవిడ్-19కు బలయ్యారు. జులై నుంచి కరోనా కేసుల్లో అత్యధిక పెరుగుదల ఇదే కావడం గమనార్హం. గతవారం దేశవ్యాప్తంగా మొత్తం 1.56 లక్షల కేసులు నిర్ధారణ అయ్యాయి.డిసెంబరు 14-20 మధ్య నుంచి 12 వారాల తర్వాత పాజిటివ్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో బయటపడటం ఇదే తొలిసారి.గత నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసుల రెట్టింపు కావడంతో దేశంలో మహమ్మారి రెండో దశ విజృంభణకు సంకేతం. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు గత 24 గంటల్లో 26,386 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 119 మంది కరోనాకు బలయ్యారు. డిసెంబరు 19 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి.మార్చి తొలివారం కంటే రెండో వారంలో 38,714కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు రెండో వారం తర్వాత పాజిటివ్ కేసులు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. గతేడాది జూన్ రెండో వారం తర్వాత ఫిబ్రవరి 8-14 మధ్య అత్యల్ప కేసులు నమోదయ్యాయి. ఆ వారంలో 77,000 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. అప్పటి నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అటు కరోనా మరణాలు కూడా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.గతవారం 876 మంది ప్రాణాలు కోల్పోగా.. జనవరి నాలుగో వారం (975) తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.భారత్‌లో ఇప్పటి వరకూ 11,385,519 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో మరోసారి మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం రికార్డుస్థాయిలో 16,620 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు 30 తర్వాత అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి.అటు కర్ణాటకలో 934 మంది కొత్తగా వైరస్ బారినపడగా.. బెంగళూరులోనే 628 కేసులు ఉన్నాయి. గుజరాత్‌లోనూ 810 కేసులు బయటపడ్డాయి. తమిళనాడులోనూ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం అక్కడ 759 కేసులు నిర్ధారణ అయ్యాయి. మధ్యప్రదేశ్ 743, ఆంధ్రప్రదేశ్ 298, బెంగాల్ 283, రాజస్థాన్ 250 మందికి వైరస్ సోకింది.