న్యూఢిల్లీ మార్చ్ 15
జీఎస్టీ పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెట్రో ధరలు రికార్డుస్ధాయికి చేరి సామాన్యుడికి భారమైన క్రమంలో పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తారనే వార్తల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ప్రతిఒక్కరినీ నిరాశపరిచింది. లోక్‌సభలో శుక్రవారం ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ ప్రస్తుతం ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సహా సహజ వాయు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.రాష్ట్రాలు కూడా ప్రాతినిథ్యం వహిస్తున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఇప్పటివరకూ ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎవరూ సిఫార్సు చేయలేదని చెప్పారు. ఆదాయ ప్రభావాల అంచనా సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఐదు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌పరిశీలించవచ్చని వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెంపు నుంచి వినిమయదారులకు ఊరట కల్పించేలా పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్ర ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని, జీఎస్టీ పరిధిలోకి వీటిని చేర్చే విషయమై సంప్రదింపులు జరపాలని నిర్మలా సీతారామన్ ఇటీవల పలుమార్లు పేర్కన్న సంగతి తెలిసిందే.