YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలు నేర్పించిన పాఠాలు

ఎన్నికలు నేర్పించిన పాఠాలు

విజయవాడ, మార్చి 16, తిపక్షాల ఆశలు ఆవిరైపోయాయి. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. పంచాయతీల్లో అయిదో వంతు స్థానాల్లో అయినా తమ పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారులు గెలిచారని క్లెయిం చేసుకునే అవకాశం దక్కింది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆ ఛాన్సు కూడా మిగలలేదు. గంపగుత్తగా వైసీపీకే కట్టబెట్టక తప్పలేదు. ప్రతి ఎన్నికలోనూ గెలుపోటములు సహజం. దాదాపు రెండేళ్ల పాలన తర్వాత ఇంతటి ఏకపక్ష విజయం అధికార పార్టీ సైతం వూహించలేదు. ఒక్కటంటే ఒక్క మునిసిపాలిటీలోనూ, కార్పొరేషన్ లోనూ ప్రతిపక్ష జెండా ఎగిరే పరిస్థితి లేకపోవడం నిజంగా విషాదమే. వైసీపీ శ్రేణులు, నాయకత్వం సంతోషించవచ్చు. కానీ ప్రజాస్వామ్యానికి మేలు చేసే పరిణామమైతే కాదు. శాసనసభ ఎన్నికల పలితాలను మించి అధికార పార్టీ అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికలకు ముందు డాంబికాలు పోయిన తెలుగుదేశం పార్టీ అన్నిచోట్లా అవమానాలే ఎదుర్కొంది. ఇక బీజేపీ, జనసేన కూటమైతే చెప్పనే అక్కర్లేదు. చాప చుట్టేసినట్లే. అక్కడక్కడ దక్కిన ఒకటి రెండు వార్డులు ఓదార్పునకు మాత్రమే సరిపోతాయి. ఈ చారిత్రక విజయానికి వైసీపీ వ్యూహాలు ఎంతకీలకంగా పనిచేశాయో ప్రతిపక్షాల వైఫల్యాలు అంతే కారణమయ్యాయి.మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో అధికార పార్టీకి సవాల్ విసిరింది. మూడు రాజధానులపై వైసీపీ సభ్యులు రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరాలనేది టీడీపీ డిమాండ్. అది గొంతెమ్మ కోరిక. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో టీడీపీ విఫలమైంది. అమరావతి సెంటిమెంటును రగిల్చేందుకు ప్రయత్నించినా ఇతర ప్రాంతాల్లో సొంత క్యాడర్ నుంచే మద్దతు లభించలేదు. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలైనా అమరావతి డిమాండ్ కు మద్దతుగా టీడీపీని బలపరుస్తారని ఆ పార్టీ ఆశించింది. ఈ ఎన్నికతో రాజధాని అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని తేలిపోయింది. సామాజిక పరంగా బలమైన మద్దతు ఉన్న విజయవాడలోనూ, రాజధాని జిల్లా అయిన గుంటూరు లోనూ కనీస పోటీనివ్వలేక టీడీపీ చతికిలపడిపోయింది. ప్రజల్లో అమరావతి సెంటిమెంటు ప్రభావం చూపి ఉంటే వైసీపీపై కనీస వ్యతిరేకత కనబరిచి ఉండేవారు. శాసనసభ్యులంతా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పు చాలు. మా మూడు రాజధానులకే అనుకూలమని వైసీపీ క్లెయిం చేస్తుంది. అందుకు తగిన నైతిక మద్దతు ఈ మునిసిపోరుతో లభించినట్లే. ఇకపై టీడీపీ ఈ విషయాన్ని రాజకీయాంశంగా చేయకుండా ఉంటేనే ఆ పార్టీకి భవిష్యత్తులో మేలు.విశాఖ పట్నానికి కార్యనిర్వాహక రాజదానిని తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడి ప్రజలు కోరుకోవడం లేదని టీడీపీ వాదించింది. అంతేకాకుండా శాసనసభ ఎన్నికల్లో టీడీపీకి విశాఖ ప్రాంతంలో బలమైన మద్దతే లభించింది. రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన తరుణంలో విశాఖ ఉక్కు ఉద్యమం ప్రతిపక్షాలకు అయాచిత వరంగా మారింది. ఉక్కు ఉద్యమం ప్రాతిపదికగా వైసీపికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని టీడీపీ ఆశలు పెంచుకుంది. గ్రేటర్ విశాఖలో నెగ్గితే రాజధానిని ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రచారం చేయవచ్చని బావించింది. అయినా విశాఖ ప్రజానీకం ఉక్కు ఉద్యమాన్ని, తెలుగుదేశం వాదనను పట్టించుకోలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వైసీపీ అంగీకరించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఆ పార్టీకే ఓటర్లు పట్టం గట్టారు. దీనివల్ల ఉద్యమానికి కూడా నష్టమే చేకూరింది. ఇకపై వైసీపీ స్లీల్ ప్లాంట్ ఇష్యూను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. తాను అనుకున్నదే చేస్తుంది. కేంద్రంతో సయోధ్య కోరుకుంటున్న జగన్ ఉద్యమానికి నీళ్లు వదిలేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా బహిరంగంగా ప్రకటించకపోయినా పరోక్షంగా ఉద్యమాన్ని నీరు కార్చేందుకే వైసీపీ ప్రయత్నిస్తుంది.ఈ ఎన్నికతో ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. 2019లో వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమాలు, ఆందోళనలకు టీడీపీ తెర లేపింది. కనీసం ప్రభుత్వం కుదుటపడే సావకాశం ఇవ్వలేదు. ప్రతి అంశం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంశం, దేవాలయాలపై దాడుల విషయం అన్నిట్లోనూ టీడీపీ సంయమనం కోల్పోయి ప్రజల్లో పలచనై పోయింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న లౌకిక ముద్రను పణంగా పెట్టి దేవాలయాల దాడుల అంశాన్ని రాజకీయ మయం చేసింది. అమరావతి రాజధానిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఎటువంటి సెంటిమెంటు లేదని తెలిసినా అదే విషయాన్ని పట్టుకుని వేలాడింది. వైసీపీ సంక్షేమం, సోషల్ ఇంజినీరింగ్ ద్వారా పటిష్టమైన పునాదులు వేసుకుంది. దానిని గుర్తించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేసుకుని ఉండాల్సింది. ఆ దిశలో ఆలోచన చేయకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమను అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే భ్రమలకు లోనైంది తెలుగుదేశం. అనుకూల మీడియా ప్రచారంతో కళ్లకు గంతలు కట్టుకుంది. బీజేపీ, జనసేన కూటమి కూడా తమ బలంపై అతిగా అంచనాలు వేసుకుంది. ఉభయగోదావరి, విశాఖ, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో జనసేన ప్రభావం బలంగా ఉంటుందని భావించారు. కానీ తుస్సుమనిపించింది. కూటమిలో జనసేన తప్పించి బీజేపీ ఆనవాళ్లు పట్టుకోవడమూ కష్టమైపోయింది. మొత్తమ్మీద ఫలితాలు 2024 వరకూ వైసీపీకి ఎదురులేదన్న రాజకీయ వాస్తవాన్ని ఆవిష్కరించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను వైసీపీకి మనో ధైర్యాన్ని పెంచాయి.

Related Posts