YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్వరలో సాగర్ ఆయకట్టుకు నీరు

త్వరలో సాగర్ ఆయకట్టుకు నీరు

గుంటూరు, మార్చి 16, రెండేళ్లుగా వ్యవసాయ సీజన్లు కోల్పోతున్న నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగంలో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎగువన తెలంగాణ రాష్ట్రంతో తలెత్తిన పేచీ కారణంగా ఈ ఏడాది మంచినీటికి అలమటించాల్సిన దైన్య స్థితి నెలకొంది.. ప్రస్తుతం వేసవి ముంచుకొచ్చినా వచ్చే నెల వరకు నీటిని విడుదలచేసే వెసులుబాటు లేదు. సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 10లక్షల హెక్టార్లఆయకట్టు సాగవుతోంది.. కుడి కాల్వ పరిధిలో గత ఏడాది అనధికారిక క్రాప్‌హాలీడే కొనసాగింది.. రబీకి కూడా నీరందలేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం పప్పు్ధన్యాలను సబ్సిడీపై అందించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కుడికాల్వ పరిధిలో ఐదు లక్షల హెక్టార్లకు బదులు 50వేల ఎకరాల్లో పప్పు్ధన్యాల సాగు చేశారు. దాళ్వా వరిపంటకు స్వస్తిచెప్పారు. కుడికాల్వ నుంచి 80 టిఎంసిల నీటిని దామాషా ప్రకారం ఏపి వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో 45 టిఎంసిలు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు వదలాల్సి ఉంది. జలాశయంలో గరిష్ఠ సామర్ధ్యంలో నీరు లేనందున దిగువకు నీటిని విడుదలచేసేదిలేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలతో అనుసంధానం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కుడి కాల్వకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా నూజివీడు, మైలవరం, నందిగామ ప్రాంతాలకు ఎడమ కాల్వ ద్వారా గోదావరి నీటిని అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రసిద్ధ వాప్కోస్ సంస్థ డిజైన్లకు రూపకల్పన చేస్తోంది..పథకం అంచనాలు త్వరలో ఖరారు కానున్నాయి.. గోదావరి మిగులు జలాలు 300 టిఎంసిల మేర సముద్రంలో కలుస్తున్నాయి.. ఈ నీటిని మళ్లించడం ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలో సాగుకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కృష్ణాడెల్టాకు గత ఏడాది పట్టిసీమ నుంచి నీరందించడం ద్వారా ఖరీఫ్ గట్టెక్కింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అధికమవుతాయని వాతావరణ శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టుకు సాగునీరందే విషయమై ఒకింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం మొత్తం సాగర్ కుడికాల్వ పరిధిలోనే ఉంది. ఈ ప్రాంతానికి నీరందాలంటే పులిచింతల, నాగార్జున సాగర్ మధ్య కాల్వలు అవసరం. ఇందుకోసం స్థల పరిశీలన జరుపుతున్నారు. అయితే కొత్తగా వచ్చే ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు మరో దశాబ్దానికైనా పూర్తికావనే ఆందోళన రైతుల్ని పట్టిపీడిస్తోంది.. ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దీనిపై సమగ్ర నివేదిక అందిస్తేకానీ తుది నిర్ణయం తీసుకునే అవకాశంలేదని చెప్తున్నారు.

Related Posts