గుంటూరు, మార్చి 15, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎక్కడ ఓడినా విజయవాడ, గుంటూరుపై మాత్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు మున్సిపాల్టీలు ఆ పార్టీ కలల సౌధాలు. ఐదేళ్ల ప్రభుత్వంలో ఈ రెండు కార్పొరేషన్లలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది అన్నది కూడా వాస్తవం. అలాంటిది ఈ రెండు చోట్లా కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఉన్నంతలో విజయవాడలోనే ఆ పార్టీకి సీట్ల కంటే కనీసం చెప్పుకోదగ్గ ఓట్లు అయినా వచ్చాయి. అమరావతి విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా.. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక కార్పొరేషన్లో మాత్రం టీడీపీ ఘోరంగా ఓడింది. కమ్మ సామ్రాజ్యానికి పెట్టని కోటగా ఉండడంతో పాటు రాజధాని ఉద్యమం యేడాదికి పైగా జరుగుతున్నా టీడీపీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది.గుంటూరు కార్పొరేషన్‌కు చివరిగా 2005లో ఎన్నికలు జరిగాయి. 16 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కంచుకోటలో సత్తా చాటుకోవాల్సిన టీడీపీ అడ్డదిడ్డమైన ప్లానింగ్‌తో పరువు పోగొట్టుకుంది. మొత్తం 57 డివిజన్లకు గాను వైసీపీ 45, టీడీపీ 8, బీజేపీ, జనసేన 4, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. కర్ణుడు చావుకు అనేక కారణాలు అన్నట్టు ఇక్కడ టీడీపీ ఘోర వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి.ఇది నిజంగా విచిత్రమే… పలు డివిజన్లలో పోటీ చేసే వాళ్లకు నామినేషన్లు పూర్తి చేసేవారు… న్యాయ పరమైన సలహాలు ఇచ్చేవారే లేకుండా పోయారు. దీంతో రెండు డివిజన్లలో నామినేషన్లు సరిగా వేయలేక స్క్రూటీనీలో పోగొట్టుకోవాల్సి వచ్చింది. కీలక కార్పొరేషన్ పట్ల అటు రాష్ట్ర నాయకత్వం కావొచ్చు.. ఇటు స్థానిక నాయకత్వం కావొచ్చు ఎన్నికలకు ముందే ఎంత ఉదాశీనంగా ఉందో అర్థమవుతోంది.గుంటూరు జిల్లా టీడీపీలో అందరూ ఉద్దండులే… వారంతా ఎన్నికల్లో ఓటమి తర్వాత పేరుకు మాత్రమే సీనియర్లుగా ఉంటూ పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంత ప్రతిష్టాత్మక కార్పోరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నా యరపతినేని శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు, మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీథర్ వీరంతా ఏమైపోయారో కూడా తెలియదు. సీనియర్ నేతలు ఎవ్వరూ కూడా తమకెందుకులే అన్న ధోరణితో ఉండడంతో కూడా పార్టీకి దెబ్బ కొట్టింది. వీరిలో చాలా మంది నాయకులకు మునిసిపల్ ఎన్నికలు సొంత నియోజకవర్గాల్లో లేకపోయినా వీరు కూడా మాకెందుకులే అని పట్టించుకోలేదు.ఇక ముందుగానే పశ్చిమ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని) ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో కమ్మ పెత్తనం పార్టీలో ఎక్కువైందన్న విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న విజయవాడతో పాటు గుంటూరు మేయర్ అభ్యర్థులను ఈ వర్గానికే ముందుగా ఎనౌన్స్ చేయడం కూడా రెండు చోట్లా మైనస్ అయ్యింది. నగరంలో ఎప్పటి నుంచో మైనార్టీలు గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ఉంటే … వైశ్య వర్గం టీడీపీకే సపోర్ట్ చేస్తోంది. ఈ సారి వైశ్యలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆ వర్గం ఓటర్లు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ వర్గం నుంచి పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి పార్టీ మారిపోవడం కూడా మైనస్‌లలో ఒక మైనస్.ఆర్థికంగా కూడా అటు పార్టీ అధిష్టానంతో పాటు స్థానిక నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు. చాలా మంది కార్పొరేటర్ అభ్యర్థులు అయితే మాకు ఎంపీ జయదేవ్ సాయం చేస్తారని చెప్పగా… జయదేవ్ కూడా ఈ ఖర్చంతా నాకెందుకు అని పట్టించుకోలేదు. మేయర్ అభ్యర్థి చేసిన సాయం ఎవ్వరికి ఓ మూలకు కూడా రాలేదు. టీడీపీకి ఓటమికి ఆర్థికంగా వెనకబడడం కూడా కారణమే.టీడీపీ ముందు నుంచి అమరావతి సెంటిమెంట్ గట్టెక్కిస్తుందన్న అతి ధీమాతో ఉంది. ఆ సెంటిమెంట్‌ను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సంక్షేమంతో పాటు మరో మూడేళ్లు ఈ ప్రభుత్వమే ఉంటుందని… ప్రభుత్వంతోనే కలిసి నడుద్దామని ప్రజలు డిసైడ్ అయిపోయారు. దీనికి తోడు అధికార పార్టీ నేతల్లో రాష్ట్ర నాయకులు కూడా గుంటూరుపై బాగా ఫోకస్ పెట్టడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది.