ఏలూరు, మార్చి 17, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగూ విజయం సాధించలేం… కనీసం అధికార వైసీపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కూడా టీడీపీ ఎన్నో అగచాట్లు పడుతోంది. నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యే సరికే వైసీపీకి దాదాపుగా 5 కార్పొరేషన్లు, 20 మున్సిపాల్టీల్లో విజయం వచ్చేసింది. వీటిల్లో కొన్ని స్వీప్ అవ్వగా.. మరి కొన్ని చోట్ల మాత్రం నామమాత్రపు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అయినా పరువు కాపాడుకునేందుకు టీడీపీ నేతలు అధిష్టానం మాటను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ స్థానిక పొత్తులకు రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల జనసేనతో పొత్తు పెట్టుకోవడం పార్టీ అగ్ర నాయకత్వానికి నచ్చకపోయినా స్థానిక నాయకులు తమకు తోచినట్టుగా పొత్తులు పెట్టేసుకుంటున్నారు.కొన్ని చోట్ల సీట్లు త్యాగం చేయకపోతే పార్టీ బతికే పరిస్థితి లేకపోవడం… మరి కొన్ని చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో స్థానిక సర్దుబాట్లకు దిగని పరిస్థితి. కీలకమైన గ్రేటర్ విశాఖలో టీడీపీ మేయర్ పీఠం దక్కించుకుని మూడున్నర దశాబ్దాలు అయ్యింది. ఈ సారి కూడా అక్కడ సానుకూల పరిస్థితులు లేకపోవడంతో విశాఖలో బలంగా ఉన్న వామపక్షాలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కార్మిక సంఘాలు ఎక్కువుగా ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎంలకు కొన్ని డివిజన్లు కేటాయించింది.ఇక కొన్ని చోట్ల జనసేనతోనూ పొత్తు పెట్టుకుంది. పార్టీ బలంగా ఉన్న విజయవాడలో… అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న తూర్పు నియోజకవర్గంలోనే కొన్ని డివిజన్లలో టీడీపీ పోటీ చేయకుండా జనసేన అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. గుంటూరు నగరంలో కొన్ని డివిజన్లలో రెండు పార్టీలు పోటీలో ఉన్నా జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ సైలెంట్ అవ్వడం, టీడీపీ బలంగా ఉన్న చోట జనసేన సైలెంట్ అయ్యేలా ఒప్పందం కుదిర్చుకుంది. కొన్ని చోట్ల నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు వైసీపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు జనసేనతో ఇంటర్నల్ పొత్తులు పెట్టుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలుతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని మున్సిపాల్టీల్లో ఇదే పరిస్థితి ఉంది. మరి కొందరు పార్టీ నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ ఈ పొత్తులు తప్పవని… లేకపోతే టీడీపీలో ఉండి రాజకీయం చేయలేమని చెపుతున్న పరిస్థితి. 2024లో టీడీపీ పొత్తులతోనే ముందుకు వెళ్లాలన్నది చంద్రబాబు మదిలో ఉందో లేదో కాని… స్థానిక నాయకులు, కేడర్ మాత్రం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.