తిరుపతి, మార్చి 17. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక తిరుపతి ఉప ఎన్నిక మాత్రమే మిగిలింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు దాదాపుగా పూర్తయినట్లే. మరో మూడేళ్ల వరకూ ఎన్నికలు అనేవి ఉండవు. అయితే తిరుపతి ఉప ఎన్నికలోనైనా తెలుగుదేశం పార్టీ తన పరువు నిలుపుకుంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తిరుపతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావస్తుంది.పనబాక లక్ష్మి ఈ మూడు నెలల నుంచి తిరుపతి నియోజకవర్గం పరిధిలో పర్యటించింది తక్కవనే చెప్పాలి. జనవరి 17వ తేదీ నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి కూడా పనబాక లక్ష్మి హాజరుకాలేదు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి పడ్డాయి. పోనీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పనబాక లక్ష్మి పార్టీ తరుపున ప్రచారం చేయలేదు.కనీసం తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత చురుగ్గా పాల్గొని ఉంటే పనబాక లక్ష్మికి ఉప ఎన్నికల్లో సులువు అయ్యేది అని అంటున్నారు. కానీ పనబాక లక్ష్మి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ గా తీసుకున్నారు. చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్భంధించినప్పుడు కూడా పనబాక లక్ష్మి స్పందించలేదు. తాను పోటీ చేయబోయే స్థానంలో పార్టీ అధినేత వచ్చినా ఆమె రెస్పాండ్ కాకపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది.పనబాక లక్ష్మి తొలి నుంచి పోటికి నిరాసక్తత చూపుతున్నారని తెలిసింది. చంద్రబాబు బలవంతంగా ఒప్పించి ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు వైసీపీ చేతిలోనే ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేకపోవడంతో తాను గెలవలేమని పనబాక లక్ష్మి ముందుగానే డిసైడ్ అయ్యారంటున్నారు. అందుకే ఈ ఎన్నికను ఆమె సీరియస్ గా తీసుకోలేదంటున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే పనబాక లక్ష్మి చేతులెత్తేసినట్లే కనపడుతుంది.