విజయవాడ, మార్చి 17, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లో రాటుదేలినట్లే కన్పిస్తుంది. కేవలం ఎనిమిదేళ్లలో ఆయన నలభై ఏళ్లకు పైబడి అనుభవం సంపాదించినట్లే కనపడుతుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కేవలం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచే కథంతా జగన్ నడిపించగలిగారు. అత్యథిక శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. తాడేపల్లి నుంచే ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తూ తన పార్టీ విజయావకాశాలను మెరుగుపర్చుకోగలిగారు.అధినాయకత్వం బలంగా ఉంటే స్థానిక నేతలు కూడా అంతే బలంగా ఉంటారు. పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టినా అర్థముంది. దానికి పార్టీ గుర్తులు లేకపోవడంతో ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ప్రతిపార్టీకి ప్రతిష్టాత్మకమే. అందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ జగన్ మాత్రం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టలేదు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచే ఎన్నికల వ్యూహాన్ని అక్కడి నేతలకు అందిస్తున్నారు.ఇక ప్రతిపక్షనేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు కూడా చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదల చేశారు. కానీ జగన్ మాత్రం మున్సిపల్ ఎన్నికలకు కూడా మ్యానిఫేస్టో విడుదల చేయలేదు. కేవలం స్థానిక నాయకత్వానికి స్థానిక సమస్యల పైనే ప్రచారం చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ బాధ్యతలను సీనియర్ నేతలకు, మంత్రులకు అప్పగించారు.నామినేషన్ల నుంచి ఉపసంహరణల వరకూ, ప్రచారం నుంచి పోలింగ్ వరకూ ముఖ్యమైన కార్పొరేషన్లలో ఎప్పటికప్పుడు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసేలా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో జగన్ ప్రచారానికి వెళ్లకుండానే ముఖ్యమైన ఎన్నికలను జగన్ ముగించేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం జగన్ ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.