YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ దారిలో గంటా

వైసీపీ దారిలో గంటా

విశాఖపట్టణం, మార్చి 17, మొత్తానికి ఒక అతి పెద్ద రాజకీయ డైలామాకు త్వరలోనే తెర పడబోతోంది. విశాఖ జిల్లాకు చెందిన పొలిటికల్ బిగ్ షాట్ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ఇక ముహూర్తమే తరువాయి. జగన్ పాలన రెండేళ్ళకు దగ్గరపడుతున్న వేళ స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటుకుంటున్న వేళ టీడీపీని ఏ మాత్రం క్షమించేది లేదు అన్నట్లుగా జగన్ దూకుడు మీద ఉన్నారు. దాంతో ఇంతకాలం లోకల్ లీడర్స్ మాట మీద మిన్నకున్న జగన్ ఇపుడు మాత్రం సొంతంగానే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే గంటా శ్రీనివాసరావు లాంటి వారిని చేరదీయడం. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీలో వైసీపీకి ఏకపక్ష విజయాలను ఖరారు చేసుకోవడం. ప్రత్యర్ధి టీడీపీని సోదిలోకి కూడా లేకుండా చేయడం.నిజానికి విజయసాయిరెడ్డి ఇంతకాలం విశాఖ రాజకీయాలను చూస్తూ వస్తున్నారు. ఆయనకు అక్కడ లోకల్ లీడర్ల ఆలోచనలు కూడా తెలుసు. దాంతో పాటు గంటా శ్రీనివాసరావు హై హ్యాండ్ మెంటాలిటీ కూడా విజయసాయిరెడ్డికి కొంత ఇబ్బందిగా ఉందని చెబుతారు. అందుకే ఆయన రాకకు ఇంతకాలం బ్రేకులు వేశారని అంటున్నారు. ఇపుడు ఏకంగా సాయిరెడ్డి నోటి వెంటే ఒక సంచలన ప్రకటన వెలువడింది. గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరాలనుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని విజయసాయిరెడ్డి పక్కా క్లారిటీగా చెప్పేసారు. వైసీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని కూడా పచ్చ జెండా ఊపేశారు.ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒంటరి అయింది మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రమే అని చెబుతారు. నిజానికి అవంతి విశాఖ రాజకీయాలను మొత్తం భుజాన వేసుకోవాలి. కానీ ఒక ఎంపీ అయి ఉండి విజయసాయిరెడ్డి విశాఖ పార్టీ భారమంతా మోస్తున్నారు. పైగా అవంతి అనుకున్నంతగా దూకుడు రాజకీయం చేయలేరని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే విశాఖ రాజకీయాలను పూర్తిగా ఒడిసిపట్టాలంటే గంటా శ్రీనివాసరావు లాంటి బిగ్ హ్యాండ్ తమకు అవసరం అని భావిస్తోంది. ఇక గ్రేటర్ విశాఖ ఎన్నికల వేళ గంటా కుడి భుజం, బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన కాశీ విశ్వనాధ్ వైసీపీలో చేరిపోయారు. ఆయన వెనక గంటా ఉన్నారు అని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. మరి దాంతో ఇపుడు గంటా శ్రీనివాసరావు రావడమే తరువాయి అన్న మాట వినిపిస్తోంది. దాంతో మంత్రి అవంతి ఈ పరిణామాలతో నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.విశాఖ సిటీలో టీడీపీ స్ట్రాంగ్ అని ఇంతకాలం ఆ పార్టీ పెద్దలు మురిసిపోయారు. వాటిని తప్పు అన్నట్లుగా తాజా పరిణామాలు, స్థానిక ఎన్నికలూ నిరూపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ మరో మూడేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉండడం, టీడీపీ భవిష్యత్తు అంధకారం కావడంతో కీలకమైన నాయకులు అంతా ఇపుడు వైసీపీ బాట పడుతున్నారని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ అనుకున్నది సాధిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీలోకి రావాలని అనుకున్న గంటా శ్రీనివాసరావు లక్ష్యం కూడా నెరవేరుతోంది. ఇక గంటా శ్రీనివాసరావు చేరిక ఖాయమని తేలుతున్న వేళ విశాఖలో రాజకీయం వేగంగా మారడం కూడా అంతే ఖాయమని అంటున్నారు

Related Posts