YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలానికి దారేది...

కమలానికి దారేది...

గుంటూరు, మార్చి 17, ప్రజాస్వామ్యంలో అసలైన ప్రభువులు జనమే. వారు ఎవరికి ఓటేస్తే వారే సేవకులు అవుతారు. అంతిమ అధికారం మాత్రం ప్రజలదే. కానీ ఈ థియరీని అంతా ఉల్టా సీదా చేసేసి తామే రాజులమ‌ని అయిదేళ్ళ భాగ్యానికి నెత్తిన కిరీటం పెట్టుకున్న పాలకులు తెగ మిడిసిపడతారు. ఆఖరుకు కధ ఎంతదాకా వెళ్తోంది అంటే ఓటేస్తే సేవ చేసుకుంటామంటూ జనాల వద్దకు వచ్చే నాయకులు ఓటేయకపోతే తిరిగి వారినే నిందించే, దూషించే స్థాయికి దిగిపోతున్నారు. దీనికి ఆద్యుడు చంద్రబాబే అని చెప్పాలేమో. ఆయన కూడా తనకు ఓటేయకుండా ఓడించినందుకు ఈ రోజు దాకా ఏపీ ప్రజలను తప్పుపడుతూనే ఉన్నారు.ఇపుడు నిన్నటి మిత్రుడు అయిన బీజేపీ కూడా బాబు బాటలోనే నడుస్తూ ఏపీ జనాలను వీలు చిక్కినపుడల్లా నిందిస్తోంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే ఏం పాపం చేశామని మాకు ఓటేయరు అంటూ తెగ ఫీల్ అవుతున్నారు. కేంద్ర నిధులు అన్నీ కూడా కుమ్మరించి అభివృద్ధిని ఏపీ అంతా కుప్ప పోస్తే ఓట్లు మాత్రం మాకు వేయరేంటి అంటూ గుస్సా అవుతున్నారు. ఎన్నో పధకాలు, మరెన్నో నిధులు గుత్తంగా తెచ్చి మరీ ఒక్క ఏపీకే అంతా ఇస్తున్నాం కదా అని బాగానే చెబుతున్నారు. అయినా దయ లేదా అంటూ ఆయన ఆవేశపడుతున్నారు.అద్దం ఉంది, ముఖం ఉంది. నేను ఎలా ఉన్నాను అని వేరేగా అడగాల్సిన అవసరం ఏముంది. ఎదురుగా జనాలు ఉన్నారు. వారి కోరికలూ ఉన్నాయి. వాటిని తీర్చకుండా ఏదేదో చేసేశామని బీజేపీ ఎంత చెప్పినా నమ్మడానికి జనం వెర్రివాళ్లా అన్నదే మౌలికమైన ప్రశ్న. ఏపీ ప్రజలకు ఏ డొంక తిరుగుళ్ళూ లేకుండా ప్రత్యేక హోదా ఆనాడే ఇచ్చేసి ఉంటే ఈపాటికి టీడీపీకి సరిసాటిగా మా లావు పార్టీగా ఏపీలో బీజేపీ తయారుఅయ్యేది అన్నది నిజం కాదా. ఇక విభజన హామీలు తీర్చినా కూడా కమలాన్ని అందలం ఎక్కించడానికి జనాలు రెడీ అయిపోరా. ఏపీ మొత్తానికి జీవనాడి అయినా పోలవరాన్ని ఏ డౌట్లూ పెట్టకుండా చెప్పిన టైమ్ కి ఈపాటికే పూర్తి చేసి ఉంటే ఈ రోజున బీజేపీ ఇలా ఉండేదా. మరి ఇవన్నీ కరెక్ట్ రూట్లు అయితే వాటిని వదిలేసి షార్ట్ కట్ లో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటేనే కదా మొత్తం సీన్ రివర్స్ అవుతోంది.దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే నిధులు ఏపీకీ ఒక వాటాగా ఇస్తున్నారు. అంతకు మించి విభజన వల్ల అన్యాయం అయిపోయిన రాష్ట్రం అని ప్రత్యేకంగా ప్రేమ చూపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే కమలనాధులు భుజాలు తడుముకోవాల్సిందే కదా. అందువల్ల ఎంతో చేస్తున్న ఏపీలో మాకు చోటు లేదని జీవీఎల్ వంటి మేధావులు బాధపడడం బొత్తిగా అర్ధం లేని విషయమే కదా. ఇక తాము నిధులు ఇస్తూంటే ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ సర్కార్ పెద్దలు సోకు చేశారని నిందలు వేయడం కూడా తగిన పని కాదుగా. కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. రాష్ట్రాల నుంచి కట్టే పన్నుల నుంచే కదా. మొత్తానికి ఏపీలో జనం ఆదరించడంలేదని ఏడవడం కన్నా ఏపీకి ఏమేమి చేయాలో అన్నీ చేసేలా బీజేపీ నేతేలు కేంద్ర పెద్దలను ఒప్పిస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూసుకోవడమే బెటర్

Related Posts