విజయవాడ, మార్చి 17, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనానికి ప్రతిపక్షాలు ఎదురునిలవలేకపోయారు. ఆ గాలి వేగానికి తట్టుకోలేక పార్టీలన్నీ చెల్లాచెదురయ్యాయి. తాము తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు ప్రజల ఆమోదం లభించిందనేదానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏంకావాలని సాయిరెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇతర నేతలు కూడా ఇదే భావనలో ఉన్నారు. ఈ ఊపులోనే తాము అనుకున్న పనులు పూర్తిచేయడానికి వైసీపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఏపీ సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలనే నిర్ణయానికి పాలకులొచ్చేశారు. సచివాలయం తర్వాత ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా వెంటనే తరలించాలని భావిస్తున్నారు. జాప్యం చేయకుండా సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తికావాలని అంతర్గతంగా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి విశాఖపట్నానికి సచివాలయంతోపాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అది ముఖ్యమంత్రి కార్యాలయంతోనే ఆరంభం కావచ్చంటున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అమరావతి సహా అన్ని ప్రాంతాల ప్రజలు అనుకూలంగా ఉన్నారనేదానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుకున్న ఘన విజయమే నిదర్శనమని వైసీపీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ముఖ్యమంత్రిగా తానే ముందుండి.. తన కార్యాలయం తరలింపుతోనే ఆరంభిద్దామనేది ముఖ్యమంత్రి ఆలోచన అని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. విశాఖలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న భవనాల్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ వెళితే ఆ తర్వాత నెమ్మదిగా మనకు అనువుగా ఉన్న ప్రదేశాలను ఎంచుకోవచ్చనేది ముఖ్యమంత్రి ఆలోచన అంటున్నారు.కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను మున్సిపల్ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ప్రకటించింది. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో హైకోర్టును నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. పురపాలికల్లో విజయఢంకా మోగించి మంచి ఊపుమీదున్న తరుణంలోనే కార్యాలయాల తరలింపు కూడా పూర్తికావాలనేది ప్రభుత్వం ఆలోచన అని, ఉగాది పర్వదినానికి అన్ని పనులు పూర్తవుతాయని అంటున్నారు.