YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చెన్నమనేని ఇక రాడా

చెన్నమనేని ఇక రాడా

కరీంనగర్, మార్చి17, 
ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాక ఏడాది గడిచింది. ఎప్పుడొస్తారో తెలియదు.. అసలొస్తారో రారో తెలియని పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు. కరోనా టైం లో రాక, శివరాత్రి ఉత్సవాలకూ అడ్రస్‌ లేక.. ఇంకెప్పుడొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో త్వరలో రానున్న కోర్టు తీర్పు ఆసక్తికరంగా మారింది. చెన్నమనేని రమేష్... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్నారు. ఆయన భారత పౌరుడు కాదని జర్మనీ పౌరుడంటూ కోర్టులో కేసు నడుస్తోంది. కేంద్ర హోంశాఖ కూడా ఆయన భారత పౌరుడు కాదని అనేకసార్లు కోర్టుకు తెలిపింది. ఆ కేసు నేటి వరకు కోర్టులో కొనసాగుతూనే ఉంది.ఈ నెల 18వ తేదీన హైకోర్టు బెంచ్ లో తుదితీర్పు రానుంది. ఇవన్నీ పక్కనపెడితే ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని, ప్రజలను వదిలేయడం ఏంటని ప్రజలు గుర్రుగా ఉన్నారు. చివరకు తమ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎప్పుడొస్తారోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ప్రజలు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల నాటి నుండి వేములవాడ రాజన్న శివరాత్రి వేడుకల వరకు అంటే సరిగ్గా ఏడాది కాలం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గానీ, మౌలిక వసతులు గానీ, ప్రజల బాగోగులు గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా ఆయన రాకపోవడం కనీసం ఏర్పాట్లపై కూడా సమన్వయం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఆయన భారతదేశ చట్టాలను అతిక్రమించి ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని ఆయన పౌరసత్వంపై పోట్లాడుతున్న ప్రత్యర్ధుల ప్రధానారోపణ. రమేష్ బాబు వేమలవాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ప్రయాణాలన్నీ జర్మన్ పాస్ పోర్ట్ తో చేస్తున్నారనే వాదనలున్నాయి. అయితే ఎమ్మెల్యే రమేష్ బాబు కేంద్ర హోంశాఖ  2019 నవంబర్ 20న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1955 నాటి సిటిజన్ షిప్ యాక్ట్ సెక్షన్ 10 క్లాజ్ 3 ప్రకారం కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవని  రమేశ్‌ తన రిట్ పిటీషన్ లో పేర్కొన్నారు. దానిపై జస్టిస్ చల్లా కోదండరెడ్డి గత నెల 18న విచారణ జరిపారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం, పాస్ పోర్ట్ ఇప్పటికీ ఉన్నాయో, లేదో ఖచ్చితమైన సమాచారాన్ని ఆ దేశం నుంచి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అయితే విచారణ సందర్భంగా హైకోర్ట్ కొన్ని కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున భారత పౌరసత్వం లేకుండా అది సాధ్యం కాదని, ఏవైనా లోపాలుంటే మాత్రం చాలా సీరియస్ గా పరిగణించే అంశమవుతుందంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 18 న  ఎలాంటి తీర్పు రాబోతోందనేది చర్చనీయాంశంగా మారింది. అటు వేములవాడ ప్రజానీకం గెలిపించిన తమ బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యే ఏడాదిగా జర్మనీలో ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు..

Related Posts