హైదరాబాద్, మార్చి 17,
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తెలంగాణకి పంపించాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్టు చెబుతున్నారు. 698 మంది ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగుల విభజన సమయంలో తెలంగాణకి ఆప్షన్ ఇచ్చినా ఏపీకి అలాట్ అయిన ఉద్యోగులను తెలంగాణకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.తెలంగాణలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధమని సర్వీస్ ర్యాంక్ లో చివరిలో చేరేందుకు ఒప్పుకుని అండర్ టేకింగ్ ఇచ్చే తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు ఈమేరకు లేఖ రాశారు.
మూడేళ్లలో తగ్గిన 2 వేల కోట్లు
కరోనా వల్ల రాష్ట్ర ఖజానా కుదేలైంది. అన్ని రకాలుగా కలిపి దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. దాని ప్రభావం లక్ష కోట్లకు చేరిందని ఆయన ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకు రిక్తహస్తం చూపింది. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా సాయాలు, గ్రాంట్లను 'యాక్ట్ ఆఫ్ గాడ్' పేరుతో ఎగ్గొట్టిన కేంద్రం... చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు సైతం కోతలు పెడుతుండటం గమనార్హం. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను, మనకు వచ్చే గ్రాంట్లనూ పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతున్నది. ఆర్థికశాఖ లెక్కల ప్రకారం... 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా రూ.18,560 కోట్లను విడుదల చేసిన మోడీ సర్కార్... అందుకు భిన్నంగా 2020-21లో మాత్రం రూ.16,726 కోట్లనే ఇవ్వడం గమనార్హం. కేంద్రం ఇచ్చే గ్రాంటుల్లో సైతం ఇదే రకమైన స్థితి కనబడుతుండటం గమనార్హం. ఈ రూపంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.9,394 కోట్లను విడుదల చేసిన కేంద్రం, 2017-18లో మాత్రం రూ.8,177 కోట్లకే పరిమితం చేసింది. ఇదే రకమైన వైఖరి మున్ముందు కొనసాగితే రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పబోవని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.